వర్షాకాలం రాగానే చలి, తేమ, వాతావరణ మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ సమయంలో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. శరీరాన్ని ఈ సమస్యల నుంచి రక్షించుకోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పండ్లు తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వర్షాకాలంలో కొన్ని పండ్లు దూరంగా ఉంచడం అవసరం, కొన్ని మాత్రం ఈ సీజన్‌లో తినడం వల్ల శరీరానికి మంచి రక్షణ లభిస్తుంది.
వైద్య నిపుణుల ప్రకారం, వర్షాకాలంలో పుచ్చకాయ తినడం మంచిది కాదు. దీనిలో నీటి శాతం అధికంగా ఉండటంతో జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ సీజన్‌లో పుచ్చకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా పాడైపోతుంది. అదే విధంగా స్ట్రాబెర్రీలు, పీచ్ పండ్లు తినడమూ సురక్షితం కాదు. తేమ కారణంగా వీటిపై బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడం సహజం. అలాంటి పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ద్రాక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి. వర్షాకాలంలో ద్రాక్షపై ఫంగస్ పెరగడం ఎక్కువగా జరుగుతుంది, వాటిని తినడం వల్ల వాంతులు, కడుపు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇక ఆరోగ్యానికి శ్రేయస్కరమైన పండ్ల విషయానికి వస్తే, యాపిల్ వర్షాకాలంలో అత్యుత్తమ ఎంపిక. ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. అదేవిధంగా దానిమ్మ పండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి రక్షణ ఇస్తుంది. నేరేడు పండ్లు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి, ఇది వర్షాకాలంలో శరీరాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండ్లు కూడా ఈ సీజన్‌లో మంచి ఎంపిక. శరీరానికి తక్షణ శక్తినిస్తాయి, అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. లిట్చీ పండ్లు కూడా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
వైద్యులు సూచన ఏమిటంటే – వర్షాకాలంలో పండ్లు తినే ముందు అవి సరిగా శుభ్రం చేయడం తప్పనిసరి. పండ్లను ఉప్పు నీటిలో లేదా వెనిగర్ కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి తినడం మంచిది. ఇది వాటిపై ఉండే బ్యాక్టీరియా, పురుగుమందుల దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది.మొత్తం మీద, వర్షాకాలంలో ఏ పండ్లు తినాలి, ఏవి తినకూడదో తెలుసుకొని ఆహారపు అలవాట్లను మార్చుకుంటే, ఈ సీజన్‌లో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
