కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్నా చాలామంది ఆ స్కీమ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ను పొందడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హర్ ఘర్ నల్ యోజన పేరుతో కేంద్రం ఒక పథకాన్ని అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా దేశంలోని ప్రతి కుటుంబం స్వచ్ఛమైన తాగునీరు తాగే అవకాశం అయితే ఉంటుంది.
అదే సమయంలో కేంద్రం ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ను సైతం ఇస్తుండటం గమనార్హం. 2024 చివరి నాటికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ ను జల్ జీవన్ మిషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ అంచనా వ్యయం రూ.3.60 లక్షల కోట్లుగా ఉంది.
ఈ స్కీమ్ లో భాగంగా హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా 90 శాతం మొత్తాన్ని ఆ రాష్ట్రాల కోసమే ఖర్చు చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం అమలు ఖర్చును కేంద్రం భరిస్తుంది. మిగిలిన రాష్ట్రాలకు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం 50 50 శాతంగా ఉంటుందని సమాచారం అందుతోంది.
మన దేశంలో నివశించే వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు కాగా ఆధార్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, వయస్సు రుజువు కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. https://jaljeevanmission.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.