నేటి బిజీ లైఫ్ లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకోవడం చాలా కష్టమైన పనిగా భావిస్తారు. ఉదయం ఇడ్లీ చేయాలంటే రాత్రంతా పులియబెట్టే ప్రక్రియ చాలా మందికి భారంగా అనిపిస్తుంది. బిజీ జీవనశైలిలో అలాంటి పనులకు సమయం కేటాయించడం కష్టం. అయితే ఇప్పుడు మిగిలిపోయిన అన్నంతో చేసే ఒక చిట్కా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పులియబెట్టడం, నానబెట్టడం, రుబ్బడం. ఇంతకీ, ఇలా చేస్తే ఇడ్లీలు ఎలా వస్తాయో తెలుసా.. ఆశ్చర్యం కలిగించేంత మృదువుగా.. హోటల్ స్టైల్ స్పాంజీగా మారుతుంది.
ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని వాడటం చాలా మందికి పెద్దగా ముఖ్యం కాకపోయినా.. అందులో ఉన్న సహజ తేమే ఈ ఇడ్లీ విజయ రహస్యం. ఈ తేమ రవ్వతో కలిసినప్పుడు పిండికి సహజమైన గాలితనాన్ని ఇస్తుంది. పెరుగు ఆ గాలిని ఇంకా పెంచి పిండిని తేలికగా చేస్తుంది. చివర్లో వేసే ఫ్రూట్ సాల్ట్ అయితే పిండిని ఒక్కసారిగా పుంజుకునేలా చేసి, ఆవిరిలో పెట్టిన వెంటనే స్పాంజ్‌లా పొంగుతాయి.
ఈ రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇంట్లో మిగిలిన అన్నాన్ని వృథా కాకుండా వాడుకోవచ్చు. పైగా కేవలం 10–12 నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీలు ప్లేట్‌లోకి వచ్చేస్తాయి. పాన్‌లో రవ్వను స్వల్పంగా వేయించి చల్లారనివ్వడం ఈ రెసిపీ సక్సెస్‌కు కీలకం. వేడి రవ్వలో పెరుగు వేసేస్తే పిండిలో ముద్దలు పడే ప్రమాదం ఉంటుంది, అందుకే చల్లబడిన తర్వాతే కలపాలి.
మిక్సర్‌లో మెత్తగా రుబ్బిన అన్నంతో రవ్వ, పెరుగు, ఉప్పు కలిపి పిండిని అలాగే ఉంచాలి. రవ్వ పుంజుకుని సరైన మందం వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్లతో సర్దుబాటు చేస్తే పిండి రెడీ. చివరి టచ్‌గా ఫ్రూట్ సాల్ట్ వేసి వెంటనే ఇడ్లీ ప్లేట్లలో పోయాలి. ఆవిరి మీద 10–12 నిమిషాలు ఉడికిన తర్వాత ఇడ్లీలు పొంగిపొంగి స్పాంజీగా రెడీ అవుతాయి.
ఈ ఇడ్లీలను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబారుతో తింటే రుచి రెట్టింపవుతుంది. చిన్నారులు నెయ్యి వేసుకుని తింటే మరింత ఇష్టపడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రెసిపీతో చేసిన ఇడ్లీలను చాలా మంది హోటల్ స్టైల్ ఇడ్లీలతో పోల్చి తేడా తెలియదని చెప్తున్నారు. మిగిలిపోయిన అన్నం ఇలా మారిపోతుందని ఊహించని వారు కూడా ఇప్పుడు ఇంట్లో ఈ టెక్నిక్‌ని వరుసగా ట్రై చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఫుడ్ వేష్ట్ తగ్గి, సమయం కూడా ఆదా అవుతుండటంతో ఈ ఇడ్లీ రెసిపీ త్వరగా వైరల్ అవుతోంది.
