కిడ్నీ స్టోన్ అని తెలిసిన వెంటనే చాలామంది చేసే మొదటి పని.. బీర్ తాగితే స్టోన్ బయటకు వస్తుంది అన్న సలహాను నమ్మడం. స్నేహితులు, పరిచయస్తులు, సోషల్ మీడియాలో చూసిన పోస్టులు అన్నీ కలిసి ఈ అపోహను బలపరుస్తాయి. మూత్రం ఎక్కువగా వస్తే స్టోన్ కదిలి బయటకు వస్తుందన్న ఆలోచన చాలా మందిలో గట్టిగా నాటుకుపోయింది. కానీ వైద్య నిపుణులు మాత్రం ఈ ఆలోచన చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
నిజానికి బీర్ తాగితే మూత్రం పరిమాణం కొంతవరకు పెరుగుతుంది. కానీ అదే స్టోన్‌కు చికిత్స అన్నది పూర్తిగా తప్పు. 5 మిల్లీమీటర్ల కన్నా చిన్న స్టోన్స్ కొన్ని సందర్భాల్లో సహజంగా బయటకు రావచ్చు. అయితే స్టోన్ కొంచెం పెద్దగా ఉంటే బీర్ వల్ల అది బలవంతంగా కదలడం తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. మూత్రనాళంలో స్టోన్ ఇరుక్కుంటే భరించలేని నొప్పి, వాంతులు, మూత్రం ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఒక్కసారిగా తీవ్రమవుతాయి.
ఇంకో పెద్ద అపోహ ఏమిటంటే.. మందులు అవసరం లేకుండా బీర్‌తోనే స్టోన్ బయటకు వస్తుందన్న నమ్మకం. కానీ బీర్‌లో ఆక్సలేట్ ఉంటుంది. ఇదే కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి. తరచూ లేదా ఎక్కువ మొత్తంలో బీర్ తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాంతో ఇప్పటికే ఉన్న స్టోన్ సమస్య మరింత పెరగడమే కాదు.. కొత్త స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువవుతుంది. అంతేకాదు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కిడ్నీలపై అదనపు ఒత్తిడి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
కొంతమంది ఎక్కువ బీర్ తాగితే స్టోన్ త్వరగా ఫ్లష్ అవుతుంది అని భావిస్తారు. కానీ అకస్మాత్తుగా మూత్రం ఎక్కువగా రావడం స్టోన్ సురక్షితంగా బయటకు వస్తుందన్న హామీ కాదు. స్టోన్ మధ్యలో ఇరుక్కుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం వైద్యరంగంలో ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మూత్రనాళ కండరాలను రిలాక్స్ చేసి స్టోన్ నొప్పి లేకుండా బయటకు రావడానికి సహాయపడతాయి.
చికిత్స ఖరీదుగా ఉంటుందనే భయంతో కొందరు బీర్‌ను చౌకైన ప్రత్యామ్నాయంగా చూస్తారు. కానీ యూరాలజీ నిపుణుల మాటల్లో చెప్పాలంటే… ఇది ఆరోగ్యంతో చేసే జూదం. చిన్న స్టోన్స్ మందులతోనే సురక్షితంగా బయటకు రావచ్చు. అవసరమైతే నేటి ఆధునిక వైద్య పద్ధతులతో చిన్న శస్త్రచికిత్స ద్వారా కూడా స్టోన్‌ను సులభంగా తొలగించవచ్చు. ఇవన్నీ బీర్ కంటే వంద రెట్లు భద్రమైన మార్గాలు.
డాక్టర్లు ఒక మాట స్పష్టంగా చెబుతున్నారు… “బీర్ తాగితే కిడ్నీ స్టోన్ కరిగిపోతుంది” అన్నది పూర్తిగా అపోహ మాత్రమే. బీర్ స్టోన్‌ను కట్ చేయదు, కరిగించదు, బయటకు తీసుకురాదు. అసలు ఇది చికిత్సే కాదు. కిడ్నీ స్టోన్ ఉన్నవారు స్వయంగా ప్రయోగాలు చేయకుండా, తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాల్సిందే. లేదంటే ఒక చిన్న అపోహ ప్రాణాపాయం దాకా తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
