మనం అన్ని రకాల కూరగాయలను, పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్
పెట్టుకోవడం సర్వసాధారణం. అయితే అన్ని కూరగాయలకు, పండ్లకు ఈ నియమం వర్తించదు. కొన్ని పండ్లు, కూరగాయలు ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటి సహజ గుణాలు కోల్పోవడమే కాకుండా మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించి మనకు అనారోగ్యాన్ని కలగజేస్తాయి. కావున అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఫ్రిజ్ లో ఎలాంటి కూరగాయలు, పండ్లు పెట్టకూడదో, వాటి వల్ల కలిగే నష్టాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లను లేదా పచ్చి అరటికాయను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అరటిపండు సహజ గుణాన్ని కోల్పోయి నల్లగా కమిలిపోయినట్లు అవుతుంది. అలాగే రుచిని వాసనను కోల్పోయి వీటిలో షుగర్ లెవెల్స్ కూడా అధికమవుతాయి.
టమోటా మరియు వంకాయలను ఫ్రిజ్ లో పెడితే గట్టిపడడమే కాకుండా వాటి సహజ రుచిని, పోషకాలను కోల్పోతాయి. కావున టమోటాని, వంకాయలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవడం మంచిది.
దుంప కూరగాయ జాతికి చెందిన బంగాళ దుంపలను
గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేస్తే నెలరోజుల పాటు నిల్వ
ఉండి సహజ గుణాలు అలాగే ఉంటాయి. అదే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే చక్కెర శాతం అధికమవుతుంది. కూరల్లో వీటి రుచి మారుతుంది. బంగాళదుంపలను ఫ్రీజ్ లో స్టోర్ చేస్తే త్వరగా పాడవుతాయి.
అధిక సువాసన ఉన్న పూలను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్ లో పెట్టకూడదు. వీటి వాసన ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతుంది. ఆహార పదార్థాలు పూలవాసనతో కలిసిపోయి తినటానికి ఇబ్బందిగా ఉంటుంది. పూలను ఫ్రిజ్లో స్టోర్ చేయాలనుకుంటే సీల్ చేసిన బాక్స్ లో చేసుకోవచ్చు
పుచ్చకాయ లేదా దోసకాయలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల వాటిలో పుష్కలంగా ఉన్న పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్లు, సహజ రుచిని కోల్పోతుంది. ఇలాంటి పుచ్చకాయలను ఆహారంగా తీసుకున్న మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటిలో అత్యధిక నీటి నిల్వలు ఉంటాయి మరీ చల్లగా ఉంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఉల్లిపాయ ,వెల్లుల్లి వంటి వాటిని ఫ్రిజ్లో పెట్టడం మంచిది కాదు. తడి వాతావరణం వీటిపై మన ఆరోగ్యం పై ప్రభావం చూపే ప్రమాదకర ఫంగస్ వంటివి ఏర్పడతాయి. కావున ఉల్లి, వెల్లుల్లి నీ గాలి వెలుతురు సరిగా ఉండే పొడి వాతావరణంలో నిల్వ చేసుకోవడం మంచిది.