మన భారతీయ సంస్కృతిలో ఆచార సంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పిల్లలు పుట్టిన దగ్గర నుండి వారి వివాహం జరిగే వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలలకు చేసే మొట్టమొదటి కార్యక్రమం అన్నప్రాసన. ఈ అన్నప్రాసన కార్యక్రమం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు. కొంతమంది ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు. కానీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పిల్లలకు 5వ నెల పూర్తయి ఆరవ నెలలో పడిన తర్వాత 5 వ రోజున అన్న ప్రాసన చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే అన్నప్రాసన కార్యక్రమాన్ని ఎక్కడపడితే అక్కడ కాకుండా చిన్నారి మేనమామ ఇంట్లో చేయాలి.
చిన్నారికి అన్నప్రాసన చేయటానికి ఆవు పాలు లేదా పెరుగు, తేనె, నెయ్యి, అన్నంతో పరమానాన్ని వండి సిద్దం చేసుకోవాలి. ఈ పరమానాన్ని ముందుగా దైవానికి నైవేధ్యంగా సమర్పించి ఆ తరువాత దీనిని పిల్లలకు తినిపించాలి. ఇలా వండిన పరమానాన్ని వెండి పల్లెంలో తీసుకుని బంగారు ఉంగరం లేదా చెంచాతో పిల్లలకు మూడు సార్లు ముందుగా పెట్టాలి. తరువాత చేత్తో తినిపించాలి. ఈ పరమానాన్ని ముందుగా శిశువు తండ్రి తినిపించాలి. ఆ తరువాత తల్లి తరుపు వారైన మేనమామ, అమ్మమ్మ, తాతయ్య వాళ్లు తినిపించాలి. అయితే ఇలా అన్నప్రాసన్న చేయడం వల్ల శిశువుకు గర్భంలో ఉండగా వచ్చే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఐదు నెలల సమయంలో పిల్లలకు నోటి నుండి చొంగ కారుతుంది. అలాగే మాట్లాడనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చొంగ కారుతుందంటే పిల్లలకు త్వరలో దంతాలు వస్తాయని అర్థం. అనగా పిల్లలకు మనం పిండి పదార్థాలు అందించాల్సిన సమయం వచ్చిందని శరీరం తన ధర్మాలను తెలియజేస్తుంది. ఇలా పిల్లలకు ఆరు నెలల వయసులో పిండి పదార్థాలను, మాంసకృత్తులను ఆహారంగా అందించటం ప్రారంభించాలి. పిల్లల్లో చొంగ కారడం చూడగానే అన్నప్రాసన చేయాల్సిన సమయం ఆసన్నమైందని మన పెద్దలు చెబుతుంటారు. ఈ విధంగా పిల్లలకు అన్నప్రాసన వెనుక కూడా ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయని. అందువల్ల ఈ ఈ కార్యక్రమాన్ని ఎక్కడపడితే అక్కడ ఎలా పడితే అలా చేయకూడదు. దీనిని శాస్త్రం ప్రకారం చేయాలని పండితులు చెబుతున్నారు.