బరువు తగ్గాలి అనుకునే వారికి వచ్చే ప్రశ్న.. ఏం తినాలి, ఎంత తినాలనే సందిగ్ధంలో ఉంటారు. దీంతో తమ జీవనశైలిని మార్చుకుంటారు. కొంతమంది రాత్రి అన్నం మానేశారు. మరికొందరు మాత్రం రాత్రిపూటే అన్నం తింటూ బరువు తగ్గారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేస్తే బరువు తగ్గుతారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పబోయే విషయం మీ ఆహార అలవాట్లపై దృష్టి మార్చేలా ఉంటుంది. 2013లో జర్నల్ ఆఫ్ ఒబెసిటీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, బరువు పెరగడానికి ప్రధాన కారణం మనం ఎప్పుడు తింటున్నామనే అంశం కాదు. మనం ఎంత కేలరీలు తీసుకుంటున్నాం, వాటిని ఎంత శరీర శ్రమతో ఖర్చు చేస్తున్నామన్నదే.
ఒక కప్పు వండిన తెల్ల అన్నంలో సుమారుగా 200 కేలరీలు ఉంటాయి. ఇందులో 45 గ్రాముల కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కానీ మనం ఆ శక్తిని ఉపయోగించకుండా, అధికంగా అన్నం తీసుకుంటే అది శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతుంది. అదే స్థూలకాయానికి నిదర్శనం. ఇంకా పక్కాగా చెప్పాలంటే అన్నమే సమస్య. ఆన్నం ఎంత తింటున్నాం.. దానికి తోడు మిగిలిన ఆహారం ఎలా ఉంది.. శారీరక చలనం ఎంత ఉంది.. ఇవే అసలు ముడి ప్రశ్నలు. ఉదాహరణకు, మీరు రాత్రి అన్నం తింటే తప్పు కాదు. కానీ అదే ఎక్కువ పరిమాణంలో, ప్రోటీన్ లేకుండా, శారీరక శ్రమ లేకుండా తింటే మాత్రం బరువు పెరగడాన్ని మీరు ఆపలేరు.
అంతేకాదు, తెల్ల అన్నం బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే రకాల్ని ఎంచుకుంటే మంచిది. వీటివల్ల జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. ఆరోగ్యానికి మేలు చేయాలంటే అన్నం తప్పని సరి. అయితే ఆ అన్నాన్ని బరువు పెరిగిపోతుందన్న భయంతో పూర్తిగా మానేయడం కూడా సరైంది కాదు.
కేవలం అర్ధ కప్పు నుంచి ఒక కప్పు వరకు పరిమిత పరిమాణంలో తీసుకుంటే, ప్రోటీన్ (పప్పు, చికెన్, పనీర్ మొదలైనవి) తో కలిపితే, సమతుల్య ఆహారంగా మార్చవచ్చు.
మొత్తానికి చెప్పాలంటే రాత్రి అన్నం తింటే బరువు పెరుగుతుందన్నది పూర్తిగా అపోహే. ఆహారం నియమంగా తీసుకుంటే, ఆ శక్తిని శరీరానికి ఉపయోగించేలా జీవనశైలి మార్చుకుంటే మీరు ఆరోగ్యంగా బతికే అవకాశాలు అధికం. ఇకపై అన్నం చూచి భయపడకండి.
