ప్రసవం తర్వాత పెరిగే పొట్ట తగ్గాలంటే పాటించాల్సిన చిట్కాలివే.. సమస్యకు సులువుగా చెక్!

మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో బెల్లీ ఫ్యాట్ ఒకటి. గర్భధారణ సమయంలో శరీరంలో కొవ్వు పెరగడం సాధారణంగా జరుగుతుంది. ప్రసవం తర్వాత కూడా శరీరంలోని కొన్ని భాగాలలో కొవ్వు ఉంటుంది.

అయితే కొన్ని సహజ మార్గాల ద్వారా ఈ కొవ్వును కరిగించుకునే అవకాశం అయితే ఉంటుంది. డెలివరీ తర్వాత పొట్ట కొవ్వును తగ్గించాలని భావించే వాళ్లు అధిక ప్రొటీన్లు, తక్కువ కార్బ్ ఆహారం ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆహార ప్రయోజనాలు చేకూరుతాయి.

నీటి వినియోగం పొట్ట కొవ్వును తగ్గించడంలో తోడ్పడుతుంది. డెలివరీ తర్వాత శరీరంలో డీహైడ్రేషన్ సంభవించే అవకాశాలు ఉంటాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎక్కువ నీరు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడటంతో పాటు శరీరం నుండి పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిస్తుందని చెప్పవచ్చు.

డెలివరీ తర్వాత శరీరం ఫిట్‌గా ఉండటానికి తేలికపాటి వ్యాయామం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. తేలికపాటి నడక, యోగా, వ్యాయామాలు పొత్తికడుపు కండరాలను టోన్ చేయడంతో పాటు శరీరంలో కొవ్వు తగ్గుతుందని చెప్పవచ్చు. డెలివరీ తర్వాత తల్లి ఆరోగ్యం ఎంత ముఖ్యమో బిడ్డకు తల్లిపాలు కూడా అంతే ముఖ్యమని చెప్పవచ్చు. బిడ్డకు తల్లిపాలు ఇచ్చినప్పుడు, శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువు తగ్గవచ్చు.