Baba Ramdev: మనిషి జీవితం వందేళ్లు కాదంట.. యోగా గురు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..!

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో చేశారు. మనిషి జీవిత కాలం కేవలం వందేళ్ల వరకు మాత్రమే పరిమితం కాదు అని, సరిగ్గా జీవిస్తే 150 నుంచి 200 ఏళ్ల వరకు బతకవచ్చని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి తరాలు సహజంగా ఉండే జీవన విధానాన్ని వదిలేసి, జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన అలవాట్లతో 100 ఏళ్లకు తగిన ఆహారాన్ని 25 ఏళ్లలోనే పూర్తిచేస్తున్నాయని బాబా రాందేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తద్వారా శరీరంలోని గుండె, మెదడు, కళ్లు, కాలేయం ఇలా అన్ని అవయవాలు వేగంగా దెబ్బతింటున్నాయని చెబుతూ, యోగాసనాలు, ఆయుర్వేదం, ప్రకృతి జీవనశైలి అనుసరిస్తే మాత్రమే ఆయుర్దాయం పెరుగుతుందని తెలిపారు. మన శరీరాన్ని సరిగ్గా ఉపయోగిస్తే 200 ఏళ్ల జీవితకాలం అసాధ్యం కాదని ఆయన స్పష్టంగా అన్నారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వాళ్లు రాందేవ్ మాటలను సమర్థిస్తుండగా, కొందరు శాస్త్రీయంగా ఇది సాధ్యమా? అని ప్రశ్నలు వేస్తున్నారు. కచ్చితంగా ఏది నిజమో తెలియకపోయినా, బాబా రాందేవ్ మాటలు ఆరోగ్యంపై కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయంటే వాస్తవమే.