`వేలంటైన్స్ డే..` యూనివర్సల్‌గా గుర్తింపు ఉన్న రోజు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇది పాశ్చాత్య సంస్కృతి అని, మన సంప్రదాయాలకు విరుద్ధమంటూ అదే రోజు సంఘ్ పరివార్ కార్యకర్తలు పార్కుల్లో తిష్ట వేస్తుంటారు. ప్రేమికులను తరిమికొడుతుంటారు. వేలంటైన్స్ డే అంటేనే కొంతకాలంగా మనదేశంలో ఇలాంటి సన్నివేశాలే గుర్తుకు వస్తుంటాయి.
మన పొరుగుదేశం పాకిస్తాన్ ఈ ఏడాది వేలంటైన్స్ డేను విభిన్నంగా జరుపుకోనుంది. ఫిబ్రవరి 14వ తేదీని `సిస్టర్స్ డే`గా జరుపుకోవాలని పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ వ్యవసాయ యూనివర్శిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఓ సర్కులర్‌ను కూడా జారీ చేశారు. తమ తోటి విద్యార్థినులకు శాలువాలను కప్పి, సన్మానాలు కూడా చేయాలని ఆదేశించారు. పాశ్చాత్య ధోరణికి ఇస్లాం సంప్రదాయాన్ని జోడించి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వైస్ ఛాన్సలర్ జాఫర్ ఇక్బాల్ తెలిపారు.