బ్రిటన్‌లో మరోసారి బ్రెగ్జిట్ రగడ మొదలైంది. ప్రధానమంత్రి థెరెసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ఒప్పందం ఆ దేశ పార్లమెంట్ `హౌస్ ఆఫ్ కామన్స్`లో ఘోరంగా పరాజయం పాలైంది. 230 మంది సభ్యులు ఈ ఒప్పందానికి వ్యతికరేకంగా ఓటు వేశారు. 230 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్రిటన్ ప్రభుత్వ చరిత్రలోనే ఇది ఘోర పరాజయమని చెబుతున్నారు. గతంలో ఇదే అంశంపై టోనీ బ్లెయిర్ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా? వద్దా? అనే విషయానికి సంబంధించిన కొన్ని నియమ, నిబంధనలను బ్రెగ్జిట్ ఒప్పందంలో పొందుపరిచారు. దీన్ని ఆ దేశ ఎంపీలు తిరస్కరించారు. ఈ ఒప్పందం వీగిపోయిన కొద్దిసేపటికే లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అందులో థెరెసాకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. మెజారిటీ భారతీయ ఎంపీలు కూడా ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇద్దరు మాత్రమే సానుకూలంగా ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన ఏడుమంది.. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు. వారిలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ఉన్నారు. ఏడుమందిలో అలోక్ శర్మ, రిషీ సునక్ మాత్రమే బ్రెగ్జిట్ ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. వారిద్దరూ థెరిసా మే ప్రభుత్వంలో మంత్రులు కూడా.
ప్రీతి పటేల్, శైలేష్ వర, సువెల్లా బ్రావెర్‌మన్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వారు ముగ్గురూ అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులే. మరో భారతీయ సంతతికి చెందిన ఎంపీ, లేబర్ పార్టీ సీనియర్ నేతలు వీరేంద్ర శర్మ, కీత్ వాజ్, లిసా న్యాండీ, సీమా మల్హోత్రా, తన్‌మన్ జీత్ సింగ్ దేశి, ప్రీత్ కౌర్ గిల్ ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు.