ఆయన ఓటు విలువ లక్షా 80 వేలు

ఆయన ఓటు విలువ 1,80,000. అవును ఆయన ఓటు విలువ అక్షరాల లక్షా ఎనబై వేల రూపాయలు.. ఓటు వేయాలంటే నాకేం ఇస్తావో చెప్పు.. అని ఆశించే ఈ రోజుల్లో కేవలం ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు శ్రీనివాస్. అతను అమెరికా నుంచి వచ్చి ఓటు వేయడానికి అయిన ఖర్చు 1,80,000 వేల రూపాయలు. ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా తన స్వంత డబ్బు పెట్టుకొని వచ్చి ఓటు వేశాడు. ఆయనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బోలిగోర్ల శ్రీనివాస్  అలియాస్ శ్రీనివాస్.

శ్రీనివాస్

శ్రీనివాస్ అమెరికాలో ఏడేళ్ల క్రితం స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. కొలంబస్ సిటీ ఒహాయా స్టేట్ నుంచి ఆయన ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చాడు. ఓటు వేయడానికి శ్రీనివాస్ అమెరికా నుంచి రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. పలువురు అభినందించారు. శ్రీనివాస్ ను చూసి ఓటు విలువ తెలుసుకున్న గ్రామస్థులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.

సీతాఫల్‌మండికి చెందిన సత్య ప్రకాష్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. తెలంగాణలో ఎన్నికల గురించి తెలుసుకున్న సత్య ప్రకాశ్ ఓటు వేయాలనే సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మంచి  ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకునేందుకు ఓటే ఆయుధమని అందుకే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని సత్య ప్రకాశ్ అన్నారు.

సికింద్రాబాద్ కు చెందిన సరిత గౌడ్ అనే యువతి దక్షిణాఫ్రికాలో చదువుకుంటోంది. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సరిత ఇండియాకు వచ్చింది. సికింద్రాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకొని సంతోషం వ్యక్తం చేసింది.

సత్య ప్రకాశ్, సరిత

సింగపూర్ లో నివాసం ఉంటున్న నరేందర్ దంపతులు ఓటు వేయడానికి హైదరాబాద్ వచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకొని వారు ఆనందం వ్యక్తం చేశారు. మంచి ప్రజాస్వామ్య దేశానికి ఓటే ఆయుధమని దానిని అందరు తప్పకుండా పాటించాలని కోరారు.

మిర్యాలగూడకు చెందిన పబ్బు రామలింగారెడ్డి అమెరికాలో తన కూతురు వద్ద ఉంటున్నాడు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అమెరికా నుంచి మిర్యాలగూడ వచ్చాడు.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన యాపాల కృష్ణారెడ్డి లాయర్. రెండు నెలల క్రితమే తన భార్యతో కలిసి అమెరికా వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం రామన్న పేట వచ్చాడు. ఓటరు లిస్టులో తన భార్య పేరు ఉండి, తన పేరు లేకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఆయన భార్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దేశం కాని దేశంలో ఉన్నా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించిన వీరందరిని పలువురు ప్రశంసిస్తున్నారు. వీరే కాకుండా చాలా మంది వచ్చారు. కొందరివి ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు.