హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించడం ఈరోజుల్లో సర్వసాధారణంగా మారుతోంది. ఇలాంటి మరణాలకు సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సమానమే. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఇలాంటి గుండెపోటు మరణాలు సంభవించడానికి గల కారణాలు,ముందస్తు సూచికలపై కొంత అవగాహన పెంచుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు మెరుగుపరుతాయన్నది నిపుణుల సూచిక. అసలు గుండెపోటు తలెత్తడానికి కారణాలు ముందస్తుగా గుండెపోటు ప్రమాదాన్ని ఎలా గుర్తించవచ్చు వంటి విషయాల గురించి తెలుసుకుందాం.
గుండె సక్రమంగా పనిచేయడానికి రక్త ప్రసరణ వ్యవస్థ కీలక. రక్త ప్రసరణ వ్యవస్థలో లోపాలు తలెత్తి గుండెకు తగినంత రక్తప్రసరణ జరగకపోయినా లేదా పూర్తిగా నిరోధించబడిన గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. రక్తాన్ని గుండెకు తీసుకువెళ్లే ధమనుల్లో ప్రమాదకర చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అడ్డంకులు తలెత్తుతాయి దానివల్ల ధమనుల్లో రక్తం గడ్డ కట్టి రక్త సరఫరాలో లోపం తలెత్తడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని గుండెపోటు ప్రమాదం సంభవిస్తుంది. కావున రోజు వారి కార్యకలాపాల్లో క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.
గుండెపోటు వచ్చే ముందు కొన్ని సూచికలు గుర్తించవచ్చు. గుండెపోటు రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఎడమ చేయి, దవడ భాగంలో నొప్పి ఉండడం కొందరిలో అయితే ఎడమవైపు శరీర భాగాల అన్నిట్లోనూ నొప్పి ఉంటుంది. అలాగే దీర్ఘకాలం పాటు ఛాతిలో నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎడమ చేయి భుజం నుంచి మెడ వరకు తీవ్రమైన నొప్పి, అలాగే దవడ వెన్ను భాగంలో కూడా నొప్పి కలుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం చల్లబడడం, అతిగా చమటలు పట్టడం, వాంతులు ,వికారం వంటి లక్షణాలు తరచూ వేధిస్తుంటాయి. గుండెపోటు తలెత్తి స్పృహ తప్పి పడిపోయిన వెంటనే సిపిఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కావున ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం పాటు మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాలు తీసుకోండి.