పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించే అద్భుతమైన మార్గాలివే?

పిల్లల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల చదువులోనూ ఆటల్లోనూ వెనకబడి అనేక సమస్యలను ఎదుర్కోవడంతోపాటు తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై ప్రభావం పడి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను ఎల్లప్పుడూ చురుగ్గా ఉల్లాసంగా ఉంచి మెదడు పనితీరును మెరుగుపరచడానికి పిల్లల్లో పోషకాహార లోపాన్ని సవరించడానికి వీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.

పిల్లల రోజువారి ఆహారంలో అత్యధిక ప్రోటీన్స్ ఉన్న ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న కాల్షియం, విటమిన్ ఏ, మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ మూలకాలు పిల్లల శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని రక్షించి జ్ఞాపక శక్తిని పెంపొందించే ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న బాదం, పిస్తా, పల్లీలు, గుమ్మడి గింజలు, చియా గింజలు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన డ్రై ఫ్రూట్స్ పిల్లల రోజువారి ఆహారంలో తప్పకుండా ఉండాలి అప్పుడే పిల్లలు మానసికంగా అభివృద్ధి చెంది జ్ఞాపక శక్తి పెంపొందుతుంది.

చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతోపాటు మెదడు ప్రశాంతతను కలిగించే గాడమైన నిద్ర కూడా అవసరమే. వైద్యుల సూచనల ప్రకారం చిన్న పిల్లలు 8 నుంచి 10 గంటల పాటు గానమైన నిద్ర అవసరమని చెబుతున్నారు. దీనికోసం పిల్లలు పడుకునే పరిసరాలు చాలా శుభ్రంగా ఉండడంతోపాటు గాలి వెళుతురు సక్రమంగా ఉండునట్లు చూసుకోవాలి. నిద్ర సమయాలను షెడ్యూల్ ప్రకారం అమలు పరుచుకోవాలి అప్పుడే పిల్లల్లో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత తో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.

పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు కొంత ఒత్తిడి కలుగుతుంది కావున కొత్త విషయాలను వారికి అర్థమయ్యే రీతిలో బోధనా పద్ధతులను పాటించాలి. అప్పుడే మనం చెప్పే విషయాలు పిల్లలకు చక్కగా అర్థం అయ్యి ఎక్కువ రోజులు గుర్తించుకుంటారు. అలాగే పిల్లల శారీరక దృఢత్వాన్ని పెంచే క్రీడలే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి పజిల్ గేమ్స్, చెస్, సుడోకు వంటివి అలవాటు చేసుకుంటే జ్ఞాపకశక్తి కూడా పెంపొందుతుంది. ముఖ్యంగా పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపే మొబైల్ గేమ్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.