మీ చిన్నారి రోజంతా ఫోన్ చూస్తున్నారా.. స్క్రీన్ టైమ్ తగ్గించాలంటే ఇలా చేయండి..!

నేటి డిజిటల్ యుగంలో.. పిల్లల చేతుల్లో ఆటబొమ్మల కంటే ఎక్కువగా మొబైల్స్ కనిపిస్తున్నాయి. టీవీ, టాబ్లెట్, వీడియో గేమ్స్ ఇవి వారి ప్రపంచాన్ని ఆక్రమించేశాయి. ఆన్‌లైన్ క్లాసులు, యూట్యూబ్ కార్టూన్లు, గేమింగ్ యాప్‌లు.. అన్నీ కలిపి చిన్నతనాన్ని స్క్రీన్‌లకు బంధించేశాయి. ఈ అలవాటు మొదట సరదాగా కనిపించినా, దాని ప్రభావం మెల్లగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ముద్ర వేస్తోంది.

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు రెండు గంటలకు మించిన స్క్రీన్ టైమ్ పిల్లల కంటి చూపును దెబ్బతీయడమే కాకుండా, తలనొప్పి, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, ఆందోళన వంటి సమస్యలకు కారణమవుతోంది. ఎక్కువసేపు డిజిటల్ పరికరాల ముందే గడపడం వల్ల మెదడు విశ్రాంతి తీసుకోలేకపోతుంది. దీని ఫలితంగా పిల్లల మనసు అస్థిరంగా మారి, ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం ఒక కఠినమైన పని లాగా అనిపించినా, కొద్దిగా చిత్తశుద్ధి, నియంత్రణతో ఇది సాధ్యమే. నిపుణులు సూచించే కొన్ని సులభమైన పద్ధతులు తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ఉంటాయి. మొదటగా పిల్లల స్క్రీన్ వాడకానికి స్పష్టమైన పరిమితి పెట్టాలి. రెండు నుండి ఐదు సంవత్సరాల పిల్లలు రోజుకు ఒక గంటకు మించి స్క్రీన్ చూడకూడదని వైద్యులు చెబుతున్నారు. పెద్ద పిల్లలు చదువులకు తప్ప మొబైల్ వాడకాన్ని తగ్గించాలి. టైమర్ లేదా అలారం ఉపయోగించి సమయ నియంత్రణ చేయడం మంచిది.

ఇక్క చిన్నారులకు తల్లిదండ్రులే ఆదర్శం.. వారు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్‌లో ఉంటే, పిల్లలకు నిబంధనలు పెట్టినా ఫలితం ఇవ్వదు. కుటుంబ సభ్యులతో చర్చలు, ఆటలు, అవుటింగ్‌లతో సమయం గడిపితే పిల్లలు సహజంగా స్క్రీన్‌లకు దూరమవుతారు. పిల్లల దృష్టిని మరల్చడానికి ఇతర సరదా మార్గాలు చూపడం కూడా ముఖ్యమే. కథలు చదవడం, డ్రాయింగ్, పెయింటింగ్, బోర్డ్ గేమ్స్, యోగా లేదా నృత్యం వంటి కార్యకలాపాలు వారిని చురుకుగా ఉంచుతాయి. ఇంట్లో కొన్ని ప్రాంతాలను స్క్రీన్ ఫ్రీ జోన్ గా నిర్ణయించడం కూడా ఉపయోగకరం. ఉదాహరణకు, బెడ్‌రూమ్ లేదా డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లు, టీవీలు నిషేధించాలి.

మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిద్రకు ముందు కనీసం ఒక గంట స్క్రీన్‌ల నుండి దూరంగా ఉండాలి. ఇది మెదడుకు విశ్రాంతి ఇచ్చి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. పేరెంటల్ కంట్రోల్ సదుపాయాలను ఉపయోగించి పిల్లలు ఏమి చూస్తున్నారు, ఎంతసేపు వాడుతున్నారు అనే విషయాన్ని పర్యవేక్షించాలి. అలాగే, పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడి స్క్రీన్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలి. నిపుణులు చెబుతున్నట్లుగా, స్క్రీన్‌ను బహుమతిగా ఇవ్వడం తప్పు. బదులుగా పుస్తకాలు, క్రీడా సామాగ్రి లేదా అవుటింగ్‌లు ఇవ్వడం ద్వారా వారిని సంతోషపరచవచ్చు.

స్క్రీన్ టైమ్ తగ్గించడం అనేది కేవలం కంటి ఆరోగ్యం కోసం మాత్రమే కాదు.. అది పిల్లల భవిష్యత్తు కోసం కూడా అవసరం. మెదడు చురుకుదనం, సామాజిక మెలకువ, మానసిక స్థైర్యం ఇవన్నీ ఆ స్క్రీన్ సమయంపై ఆధారపడి ఉంటాయి. చిన్న ప్రయత్నాలతోనే పెద్ద మార్పు సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు నియమం పాటిస్తే, పిల్లలు కూడా సహజంగా దాన్ని అలవాటు చేసుకుంటారు. చివరికి స్క్రీన్‌లతో కాదు.. స్మైల్స్‌తో గడిపే బాల్యం మనం వారికి ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి అవుతుంది.