Watermelon: పుచ్చకాయలు, ముక్కలను ఫ్రిజ్ లో పెట్టొచ్చా.. లేదా..?

Watermelon: వేసవిలో వేడి తగ్గించుకోవడానికి మంచినీళ్లు ఎక్కువగా తాగుతాం. డ్రింకులు, సుగంధి, కొబ్బరినీళ్లు, తాటి ముంజలు, నిమ్మరసం.. ఇలాంటి వాటితో వేసవి తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తాం. వీటిలో మరో ముఖ్యమైంది పుచ్చకాయ. శరీరానికి మంచి పోషకాలు అందిస్తుంది.. వేడిని తగ్గిస్తుంది. అయితే.. ఈ పుచ్చకాయను కొందరు ఫ్రిజ్ లో పెడుతూంటారు. ఎక్కువగా తెచ్చుకోవడమో.. ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టుకోవడమో చేస్తారు. అయితే.. ఇలా ఫ్రిజ్ లో పెట్టుకోవడం సరైన పద్ధతో కాదో తెలుసుకుందాం.    

       ఫ్రిజ్ లో పెట్టదగినవి.. పెట్టకూడని పండ్లలో కొన్ని ఉంటాయి. వాటిలో పుచ్చకాయ ఒకటి. ఎండల్లో ఎక్కువగా పండి.. అదే ఎండ వేడిని మనలో తగ్గిస్తుంది. తక్కువ ధరకే కూడా లభిస్తుంది. అలాగని ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టుకుని కావల్సినప్పుడు తీసుకుని తినకూడదని అంటున్నారు ఆహార నిపుణులు. ఎర్రగా ఉంటాయి.. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కానీ.. పుచ్చకాయలను ఫ్రిజ్ లో పెడితే అది అందించే పోషకాలన్నీ పోతాయని అంటోంది అమెరికా వ్యవసాయ విభాగం. అందుకు ఫ్రిజ్ లో పెట్టద్దంటోంది. తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లమైందని చెప్తోంది. పోషకాల్లేని పుచ్చకాయ తిని ఏం లాభం అని ప్రశ్నిస్తోంది.

పుచ్చకాయలు ఎప్పుడూ గట్టిగానే ఉండాలి. మెత్తగా అనిపిస్తే అవి పాడైపోయినట్టే లెక్క. పైగా.. పుచ్చకాయను కోసిన రెండు గంటలకు అవి పాడైపోతాయి. రోడ్డుపై పుచ్చకాయల్ని విక్రయించే వారు కాయలుగా అమ్ముతారు.. స్లైస్ లుగా కోసి కప్ లో పెట్టి, పెద్ద ముక్కలుగా విక్రయిస్తూంటారు. మనం వాటిని ఎప్పుడు కోశారు.. ఎంతసేపటి నుంచి అలా ఉన్నాయి.. అని ఆలోచించం. తింటాం.. టేస్టీగా ఉందనుకుంటాం. కానీ.. అప్పటికే రెండు గంటలు దాటిపోతే పాడైపోతాయి. కొందరు ప్లాస్టీక్ కవర్స్ లో కూడా పెట్టి అమ్ముతూంటారు. ఇవేమీ మంచివి కావు. ఫ్రెష్ గా మనముందు కోసినవి తినడం ఉత్తమం.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.