అధిక చెమట చికాకు తెప్పిస్తోందా..? ఇలా ట్రై చేయొచ్చు..

వేసవి వచ్చేసింది. ఒంటికి చెమట పడుతుంది. ఇదంతా చికాకు కలిగించినా.. ఒంటికి ఎంత చెమట పడితే అంత మంచిది. ఇది తెలిసిన విషయమే. కాకపోతే.. చెమట పడుతోంది అనే ఫీలింగే మనకు విసుగు తెప్పిస్తుంది. వెంటనే చల్లగాలికి ఆరాటపడతాం. కానీ.. ఒంటికి పట్టిన చెమట శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి చెమట పట్టాల్సిందే. అయితే.. ఒక్కోసారి పట్టే చెమట చర్మంపై ఉండే బాక్టీరియాకు తోడై మన శరీరం నుంచి దుర్వాసన తెప్పిస్తుంది. దీనిని పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. చంకలు, పాదాలు, అరచేతుల్లో పట్టే చెమట వల్ల ఇబ్బందిగానూ ఉంటుంది. ఈ దుర్వాసన మనతోపాటు ఇతరులకూ ఇబ్బందికర పరిణామమే.

అధికంగా చెమట పట్టేందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఆందోళన, ఆతృత, మానసిక ఒత్తిడి ఒక కారణం. ఆహారం ఎక్కువగా తినడం మరో కారణం. మధుమేహం ఉన్నవారికి అధిక చెమట పడితే వైద్యులను సంప్రదించాల్సిందే. స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు అధికంగా పడుతుంది. చిన్నతనంలో పట్టని చెమట యవ్వనంలో ప్రారంభమవుతుంది. హార్మోన్‌ల ఉత్పత్తిలో తేడాల వల్ల చెమటలు పడుతూంటాయి. అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టడానికి కారణం భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులని వైద్యులు అంటున్నారు. చెమట నివారణకు కూడా కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి.

 

  • చల్లని బ్లాక్ టీలో ముంచిన మొత్తని గుడ్డతో అరచేతులను తుడవాలి. బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆమ్లం రక్తస్రావాన్ని నివారిస్తుంది.
  • బ్లాక్ టీలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు నేచురల్ యాంటీ పెర్సెపిరెంట్‌గా పని చేసి చెమటను నియంత్రిస్తుంది.
  • బ్లాక్ టీలో 20 నిముషాలపాటు అరచేతులను ఉంచినా మంచి ఫలితం వస్తుంది.
  • కొద్దిగా నీటిలో గంధం వేసి పేస్టు చేసి అరచేతులు, అరికాళ్లు, చంకల్లో రాసుకోవచ్చు. అలోవెరా జెల్ రాసినా మంచి ఫలితం వస్తుంది.
  • కూరల్లో కారం.. వేడిగా ఆహార పదార్ధాలు తీసుకోవడం తగ్గించాలి.
  • తెల్ల ఉల్లిపాయ, బ్రకోలి, బీఫ్.. తీసుకోవడం తగ్గించాలి.