Salt: వంటల్లో ఉప్పు ఎక్కువైందా..? సింపుల్ టిప్స్ తో తగ్గించుకోండి..!

Salt: కూరల్లో ఉప్పు చాలా ముఖ్యం. కూర రుచికరంగా ఉండాలన్నా.. లేకుండా ఉండాలన్నా ‘ఉప్పు’తోనే సాధ్యం. ఏమాత్రం ఎక్కువైనా కూర చెడినట్టే. తక్కువైతే మాత్రం సరి చేసుకోవచ్చు. అందుకే వంటల్లో ఎంత సిద్ధహస్తుడైనా.. ఇంట్లో ఆడవారైనా ఒక్కోసారి ఉప్పు విషయంలో తడబడక తప్పని పరిస్థితి. అయితే.. కూరల్లో ఉప్పు తక్కువైతే వేసుకుంటాం కానీ.. ఎక్కువైతేనే ఏం చేయలేం. ఒకోసారి పారేయాల్సి వస్తుంది కూడా. అలా చేయక్కర లేకుండా సింపుల్ టిప్స్ తో ఉప్పు ఎక్కువైన కూరను సరి చేయొచ్చు. రుచికరంగా మార్చుకోవచ్చు.

కూరల్లో ఉప్పు ఎక్కువైతే.. అందులో కొన్ని పోసి మళ్లీ వేడి చేస్తే ఫలితం ఉంటుంది. కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితుల్లో నీరు ఎక్కువైనట్టు అనిపించి మళ్లీ టేస్ట్ రాదు. అటువంటి సందర్భాల్లో మరికొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. దీనికి బంగాళాదుంపలను ఉపయోగించాలి. కూర, సాంబర్‌లో ఉప్పు ఎక్కువైతే అందులో బంగాళాదుంపను ముక్కలుగా చేసి  అందులో వేయండి. ఆలు గడ్డలకు ఉప్పును పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి రుచి మారుతుంది. కాసేపు ఆ ముక్కలను అలానే ఉంచి తీసేస్తే ఉప్పు తగ్గుతుంది. అసలైన టేస్ట్ వస్తుంది.

బంగాళా దుంపలు కాకపోతే ఉల్లిపాయలను కూడా ఇందుకు ఉపయోగించొచ్చు. ఇవి కూడా ఉప్పును పీల్చేస్తాయి. ఇటువంటి సందర్భాల్లో ఉల్లిపాయను స్లైస్ లుగా కోసి వేయండి. కొన్ని నిముషాల తర్వాత వాటిని తీసేస్తే ఉప్పు తగ్గుతుంది. టమాటాలు కూడా ఇందుకు ఉపయోగించొచ్చు. వీటిని చిన్న చిన్నముక్కలుగా కోసి పేస్ట్‌లా చేయాలి. దానిని కూరలో వేసి కాసేపు ఉడికించాలి. దాంతో కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గించి రుచి వచ్చేలా చేస్తుంది.

మరో రకంగా అయితే.. ఒక స్పూన్ వెనిగర్, పంచదార తీసుకోండి. వీటిని మిశ్రమంగా చేయండి. దానిని కూరలో వేసి బాగా కలపండి. కాసేపటికి టేస్ట్ మారుతుంది. అసలైన టేస్ట్ వస్తుంది. ఇంకో చిట్కా అయితే.. కొద్దిగా బియ్యం పిండి లేదా గోధుమ పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ నీళ్లతో బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉప్పు ఎక్కువైన కూరలో వేస్తే ఉప్పు తగ్గి టేస్ట్ వస్తుంది. ఇలా వండిన కూరల్లో ఉప్పు ఎక్కువైతే కంగారు, ఆందోళన.. అంతకంటే కూరను పారేయాల్సిన అవసరం లేకుండా సరి చేసుకోవచ్చు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. గమనించగలరు.