ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చలికాలంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా పెరుగుతుంది.చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా మన శరీరంలో గణనీయమైన మార్పులు సంతరించుకుంటాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనై గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చలికాలంలో గుండెపోటు సమస్యలు అధికం అవ్వడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు.
గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోయి గుండె ధమనుల పనితీరు మందగిస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తి గుండెపోటుకు కారణం అవుతుంది. ఈ సమస్య ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అప్పుడప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు ఎంత పరిమాణంలో ఉన్నాయన్న విషయం తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు శీతాకాలంలో రోజువారి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మన సంపూర్ణ ఆరోగ్యానికి కొవ్వు నిల్వలు అవసరమే అయితే అత్యధిక కొవ్వు నిల్వలు ఉన్న డైరీ ప్రొడక్ట్స్, రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాన్ని వీలైనంతవరకు దూరంగా పెట్టాలి. అత్యధిక ప్రోటీన్లు, సహజ కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ వంటివి మన రోజువారి ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే మద్యపానం ధూమపానం వంటి చెడు వ్యసనాల జోలికి అస్సలు వెళ్ళకండి. శీతాకాలంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి శరీరంలో వేడిని పెంచడానికి కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, యోగా వంటివి అలవాటు చేసుకోవడం మరి మంచిది.