మహిళల్లో వచ్చే క్యాన్సర్ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి…?

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్ల వల్ల మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళల్లో ఎక్కువగా తలెత్తే ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువల్ల మహిళలు తమ ఆరోగ్య విషయంలో జరిగే మార్పులను గమనించి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లు, వాటిని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. మహిళలో స్థూల కాయం సమస్యతో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. పిల్లలు లేకపోవడం, పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వకపోవడం, దీర్ఘకాలికంగా హార్మోనుల సమస్యతో బాధపడే వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందువల్ల శరీరంలో సంభవించిన మార్పులను గుర్తించి తరచూ రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్ ని ముందుగా గుర్తించవచ్చు. ప్రాథమిక దశలో సరైన చికిత్స తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ సమస్య నుండి బయటపడవచ్చు.

మహిళల్లో వచ్చే మరొక ప్రధానమైన క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న వయసులోనే పెళ్లి జరిగి లైంగిక చర్యలో పాల్గొనటం, లైంగిక పరమైన ఇన్ఫెక్షన్ల వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి మొదలవుతుంది. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడే వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల లైంగిక చర్యలో పాల్గొనేవారు గర్భ నిరోధక మాత్రలు వాడకుండా పురుషులు కండోమ్‌లు, స్త్రీలు డయాఫ్రమ్‌లు వాడాలి. అంతే కాకుండా విటమిన్‌ సి లోపించకుండా చూసుకోవాలి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

మహిళల్లో వచ్చే మరొక క్యాన్సర్ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌. మహిళల్లో స్థూలకాయం, మధుమేహం, శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంశపారంపర్యంగా కూడ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు, ఈస్ట్రోజన్ ఎక్కువ కాలం వాడకపోవటం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చు.