శరీరంలో చిన్న చిన్న నొప్పులు ఉంటే.. సాధారణమేనని చాలా మంది తేలికగా తీసేస్తారు. అయితే ఒక్కోసారి ఈ నొప్పులు ప్రాణాల మీదకు తెస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెన్నునొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్ల నొప్పి, ఛాతీ నొప్పి… ఇవన్నీ ఎక్కువ మంది ఎదుర్కునే సమస్యలే. కానీ ఇవి ఎప్పుడూ చిన్న సమస్యలే అని ఊహించటం పెద్ద తప్పు. ఎందుకంటే కొన్ని సార్లు ఇలాంటి నొప్పులు శరీరంలో దాచుకున్న పెద్ద సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఇవి సంకేతాలుగా మారే అవకాశం ఉంది అని డాక్టర్లు చెబుతున్నారు.
సాధారణంగా ఎక్కువ సేపు కూర్చున్నా, తప్పు కూర్చోబడ్డా వెన్ను నొప్పి వస్తుంది. కానీ ఆ నొప్పి కేవలం వెన్నుకే పరిమితం కాకుండా పైకీ కిందకీ వ్యాపిస్తే అది క్లోమం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ లేదా కిడ్నీ క్యాన్సర్‌కి లింక్ అయి ఉండే అవకాశం ఉంది. అదే రాత్రిళ్లు ఎక్కువగా నొప్పి ఉంటే, బరువు తగ్గితే, ఆకలి తగ్గితే అలా వదిలేయ కూడదు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
అలాగే, కడుపు నొప్పి కూడా సాధారణ సమస్యే. కానీ రోజులు గడిచినా తగ్గకపోవడం, తిన్న తరువాత అసౌకర్యం కలగడం వంటి లక్షణాలు అండాశయ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్‌లను సూచించవచ్చు. మలంలో రక్తం కనిపిస్తే మరీ అప్రమత్తంగా ఉండాలి. తలనొప్పి కూడా పెద్దగా పట్టించుకోని సమస్యే. కానీ వయసు పెరిగాక కొత్తగా వస్తున్న తలనొప్పి మందులతో తగ్గకపోతే, అది మెదడు క్యాన్సర్ సంకేతం కావచ్చు. జ్ఞాపకశక్తి తగ్గడం, చూపు మసకబారడం, ప్రవర్తనలో మార్పులు కూడా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు వయసులో సహజమే అనిపించినా, అదే చోట నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే ఆస్టియోసార్కోమా, లుకేమియా వంటి క్యాన్సర్‌లు దాగి ఉండే అవకాశం ఉంది. అలసట, జ్వరం, బరువు తగ్గడం కూడా ఉన్నాయంటే నిర్లక్ష్యం చేయకండి. ఛాతీ నొప్పి గుండె సమస్య అని అనిపించినా, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, రక్తం రావడం, స్వరం మారడం ఊపిరితిత్తులు లేదా అన్నవాహిక క్యాన్సర్‌కు కారణం కావచ్చు. నొప్పి చిన్నదని తక్కువ చేసి చూడకూడదు. చాలా రోజులు తగ్గకపోతే, ఇతర లక్షణాలతో కలిగితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఏ వ్యాధైనా తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులభం. అందుకే శరీరంలో మార్పులను నిర్లక్ష్యం చేయకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
