ఎన్నో పోషక విలువలు సమృద్ధిగా ఉన్న దొండకాయను మన ఆహారంలో తరచూ ఉపయోగిస్తుంటాం. అయితే పల్లె వాతావరణంలో ముళ్లపదలపై అల్లుకొని, లేదా పొలం గట్ల వెంబడి ఎక్కువగా కనిపించే చేదు దొండకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ చేదు దొండకాయలను కాకి దొండ, అడవి దొండ అని కూడా పిలుస్తుంటారు. ఈ చేదు దొండకాయలను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గంగా ఉపయోగిస్తున్నారు.
మామూలు దొండకాయ, చేదు దొండకాయ చూడడానికి ఒకే మాదిరిగా ఉన్న చేదు దొండకాయలో అద్భుతమైన ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు చేదు దొండకాయల కూరను వండుకొని తింటే జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్, మలబద్ధకం, కడుపులో పుండ్లు, ఉదర క్యాన్సర్ వంటి సమస్యలు తొలగిపోతాయి.
నోటి పుండ్లు, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు పచ్చి చేదు దొండకాయను నమిలితే మంచి ఫలితం ఉంటుంది.చేదు దొండకాయలోని గింజలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల వాంతులు, ఎక్కిళ్లు, కడుపులో వికారం వంటి అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
చేదు దొండ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీఫంగల్ గుణాలు మెండుగా లభిస్తాయి. కావున చర్మం పై వచ్చే గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి.
చేదు దొండకాయ ఆకులరసాన్ని అరికాళ్లపై రాయడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు తరచూ చేదు దొండకాయలను తింటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగి మూత్రం ద్వారా బయటికి వస్తాయి.
డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని తీసి రెండు నెలల పాటు 20 గ్రాముల మోతాదులో తీసుకుంటే డయాబెటిస్ వ్యాధి తీవ్రత తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గర్భాశయ సమస్యలతో బాధపడేవారు చేదుదొండ ఆకుల రసంతో వెల్లుల్లి రసాన్ని, ఆవపిండిని సమానంగా కలిపి మెత్తని చూర్ణాన్ని ఆహారంగా తీసుకుంటే సమస్య తొలగిపోతుంది.యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉన్న చేదు దొండకాయను తినడం వల్ల సీజనల్గా వచ్చే శ్వాస సంబంధిత సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.