అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి?

ఇష్టమైన ఆహారాన్ని కొద్దిగా ఎక్కువ తింటే ఆ రోజంతా గ్యాస్టిక్ సమస్యతో బాధపడే వారిని తరచూ మనం చూస్తూనే ఉంటాం. గ్యాస్టిక్ సమస్యకు ప్రధాన కారణం సమయానికి భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ , జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, తగిన శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో అజీర్తి, గ్యాస్టిక్ అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అసిడిటీ సమస్యను అదుపులో ఉంచడానికి మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన అందరి ఇళ్లల్లో తప్పనిసరిగా ఉండే మజ్జిగ అసిడిటీ సమస్యను అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత పలుచని మజ్జిగలో కాస్త చక్కెర వేసుకొని సేవిస్తే మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అయితే పెరుగు తినడం మంచిది కాదు.

ఆహారం తిన్న ప్రతిసారి కొన్ని సొంపు గింజలు లేదా జీలకర్రను తింటే వీటిలో ఉండే ఔషధ గుణాలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడి గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.

మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా కడుపులో మంట, అజీర్తి సమస్యతో బాధపడుతుంటే చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల అసిడిటీ సమస్య తొలగిపోతుంది.

తరచూ అజీర్తి గ్యాస్టిక్ సమస్యలతో బాధపడేవారు ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ప్రతిరోజు తులసి కషాయాన్ని సేవిస్తే వీటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ ,ఫంగల్ లక్షణాలు జీర్ణాశయంలోని చెడు మలినాలను తొలగించి జీర్ణ క్రియ రేటును మెరుగుపరుస్తుంది.దాంతో అజీర్తి , గ్యాస్టిక్ వంటి జీర్ణ సంబంధ జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అసిడిటీ సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని పాలల్లో కాస్త నెయ్యి వేసుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరినీళ్లు తాగడం వల్ల వీటిలో పుష్కలంగా ఉన్న ఆమ్లాలు ఆసిడిటీ సమస్యకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.