నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కంటే మెట్రో నగరాల్లో నివసించే వారే ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు అనేక సర్వేలో వైద్యులు సూచిస్తున్నారు. విద్య ,ఉద్యోగం దృశ అర్ధరాత్రి వరకు మేలుకొనే వారి సంఖ్య కంటే టీవీలు చూస్తూ, మొబైల్స్ పట్టుకుని సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ తెల్లవారుజాము వరకు మేల్కొని వారి సంఖ్య ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఇలా ప్రతిరోజు టీవీ, మొబైల్స్ చూస్తూ అర్ధరాత్రి వరకు మేల్కొనే వారిలో నిద్రలేమి సమస్యలతో పాటు దీర్ఘకాలంలో కంటి సమస్యలు, గుండె జబ్బులు, డయాబెటిస్, జీర్ణ సంబంధిత వ్యాధులు, సైకలాజికల్ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా మేల్కొని సుఖప్రదమైన నిద్ర కోసం కొన్ని నియమాలను పాటించండి.

వైద్యుల సూచనల ప్రకారం మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. కాబట్టి మనం చదువుకోవడానికి, ఆడుకోవడానికి ,భోజనం చేయడానికి ఎలాగైతే సమయాన్ని కేటాయించి పాటిస్తామొ అలాగే నిద్రపోవడానికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించుకోవడం తప్పనిసరి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం చేసి ఒక గ్లాసు పాలు తాగడం ఉత్తమం.

రాత్రి సమయాల్లో ఎక్కువగా మొబైల్, కంప్యూటర్, టీవీలు చూస్తుంటే వాటి నుంచి వెలువడే నీలి కాంతి మన కంటి పై తీవ్ర ప్రభావాన్ని చూపించడమే కాకుండా మనకు నిద్ర కలిగించే మెలటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో నిద్రలేమి సమస్యకు దారి తీయవచ్చు.

మనం నిద్రపోవడానికి ఉపయోగించే గదిని చాలా శుభ్రంగా మంచి వాతావరణంలో ఉండునట్లు చూసుకోవాలి. అలాగేబెడ్ రూమ్ ను ఆఫీస్ పనులకు కాకుండా నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించాలి. బెడ్ రూమ్ లో టీవీలు, మొబైల్స్ వాడడం తగ్గించాలి.

కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి ఉదయం, సాయంత్రం అలవాటు చేసుకుంటే శారీరకంగాను మానసికంగానూ ఆరోగ్యంగా ఉండడంవల్ల ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. అయితే సాయంత్రం వ్యాయామం చేసే అలవాటున్న వారు నిద్రపోవడానికి మూడు గంటల ముందే వ్యాయామాన్ని ముగించుకోవడం మంచిది.