మొబైల్‌లో దేవుడు ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకున్నారా.. వాస్తు ప్రకారం అది అశుభమంట..!

మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు కేవలం ఒక పరికరం కాదు, మన శ్వాసలాగే మారిపోయింది. ఉదయం లేవగానే చూసేది, రాత్రి నిద్రపోయే ముందు చివరిసారి చూసేది మొబైలే. ఫోన్ వాల్‌పేపర్‌ విషయంలో కూడా చాలా మంది తమ మనసుకు నచ్చిన చిత్రాలనే ఉంచుతారు.. ప్రకృతి దృశ్యాలు, కుటుంబ సభ్యుల ఫోటోలు, ప్రియమైన జ్ఞాపకాలు లేదా ఇష్టదైవాల చిత్రాలు. ముఖ్యంగా దేవుళ్ల ఫోటోలను ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఉంచుకోవడం చాలామందిలో ఒక సాధారణ అలవాటు అయింది. ఎందుకంటే “దేవుని చిత్రం ఉంటే శుభం జరుగుతుంది, దైవ కటాక్షం ఉంటుంది” అనే నమ్మకం బలంగా ఉంటుంది.

కానీ వాస్తు శాస్త్రం మాత్రం ఈ నమ్మకాన్ని సమర్థించడం లేదు. వాస్తు నిపుణుల ప్రకారం, మొబైల్ ఫోన్‌లో దేవుడు లేదా దేవాలయం చిత్రాలు ఉంచడం అశుభ సూచకం అని చెబుతున్నారు. ఎందుకంటే ఫోన్‌ను మనం ఎక్కడికైనా తీసుకెళ్తాం బాత్రూమ్‌, మరుగుదొడ్డి, ప్రయాణాల సమయంలో వివిధ ప్రదేశాలు.. ఇవి పవిత్రతకు విరుద్ధమైన ప్రదేశాలుగా పరిగణించబడతాయి. ఈ ప్రదేశాల్లో దేవతా చిత్రాలు ఉన్న ఫోన్‌ను తీసుకెళ్లడం, ఆ చిత్రాల పవిత్రతను తగ్గిస్తాయని పండితులు చెబుతున్నారు.

వాస్తు నిపుణులు చెబుతున్నట్టు, ఇలా పవిత్ర చిత్రాలను అశుభ ప్రదేశాలకు తీసుకెళ్లడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు తగ్గుతాయని, మన జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు. కొంతమంది లాక్‌స్క్రీన్‌గానూ దేవుని చిత్రాలు ఉంచడం చేస్తారు. వాస్తు ప్రకారం ఇది కూడా పూజా స్థల పవిత్రతకు విరుద్ధమని చెబుతున్నారు. చాలామంది తమ ఫోన్‌ను బాత్రూమ్‌లోకి కూడా తీసుకెళ్తారు. ఇది చాలా చెడు అలవాటు. బాత్రూమ్‌లో ఎక్కువసేపు మొబైల్‌తో గడపడం వల్ల రాహు దోష (Rahu dosha) ప్రభావం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రాహు దోషం పెరిగితే వ్యక్తి జీవితంలో అయోమయం, అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇదే కాకుండా వాస్తు ప్రకారం పవిత్ర చిత్రాలు గౌరవంగా ఉండే ప్రదేశాల్లోనే ఉండాలని సూచిస్తారు. ఫోన్‌ను మనం ప్రతీరోజు వందల సార్లు స్పర్శిస్తాం. అది పవిత్రతకు అనుకూలం కాని పరిసరాల్లో ఉంటుంది. కాబట్టి దేవతా చిత్రాలు ఉన్న ఫోన్‌ను ఉపయోగించడం వాస్తు శాస్త్రం విరుద్ధం అవుతుంది. నిపుణులు చెబుతున్న సూచనల ప్రకారం.. మొబైల్‌లో దేవుడు లేదా దేవాలయాల ఫోటోలను వాల్‌పేపర్‌గా ఉంచకూడదు.

ఇంట్లో సానుకూల శక్తులను ఆకర్షించాలంటే వాస్తు నియమాలను పాటించడం ఉత్తమ మార్గం. ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌గా సాధారణ ప్రకృతి దృశ్యాలు లేదా పాజిటివ్ వైబ్స్ ఇచ్చే చిత్రాలను ఉంచడం మంచిదని వారు చెబుతున్నారు. పవిత్రతను గౌరవిస్తేనే మన జీవితంలో శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం నిలకడగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.