తరచూ కండరాల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?

మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్,విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు లోపిస్తే మన శరీర జీవక్రియలకు అవసరమైన శక్తి లభించక అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే మన శరీరాన్ని దృఢంగా ఉంచు కండరాల్లో దూడత్వం తగ్గి తరచూ కండరాల నొప్పుల సమస్యతో బాధపడాల్సి వస్తుంది. నొప్పి తీవ్రతను భరించలేక పెయిన్ కిల్లర్ మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు, గుండె జబ్బు, లివర్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ వంటి అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

కండరాల నొప్పులు రావడానికి గల కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాల నొప్పులు రావడానికి పోషకాహార లోపం, అధిక పని ఒత్తిడి కలిగి ఉండడం, నీళ్లను తక్కువగా తాగడం, డిహైడ్రేషన్, అధిక శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు వంటి కారణాలు కావచ్చు. మొదట కారణాలను గుర్తించి మన నిత్య జీవన విధానంలో మార్పులు చేసుకుంటే కండరాల నొప్పి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఐరన్, జింకు, కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మూలకాలు తగిన మోతాదులో లేకపోతే పోషకాహార లోపం వల్ల కండరాల్లో సమస్య ఏర్పడుతుంది. దీన్ని అధిగమించడానికి సంపూర్ణ పోషక పదార్థాలు కలిగిన పండ్లు ,కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటివి నిత్యం మన ఆహారంలో ఉండునట్లు చూసుకోవాలి.

అధిక శారీరక శ్రమ చేసినప్పుడు సహజంగా కండరాల నొప్పులు వస్తాయి. మొదటిసారి వ్యాయామం, క్రీడలు వంటివి ప్రాక్టీస్ చేస్తే కండరాలు పట్టేసినట్టు అనిపించడం సహజమే. దీనికోసం విశ్రాంతి ఎక్కువగా తీసుకొని గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డిహైడ్రేషన్ సమస్య ఏర్పడి కండరాలు నొప్పిగా అనిపించవచ్చు. అందుకే దాహమైనప్పుడల్లా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. మన శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి పలుచని మజ్జిగ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలా కాకుండా చిన్నపాటి నొప్పులకే పెయిన్ కిల్లర్ మందులు వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు.