Coffee: కాఫీ తాగడానికి కారణం రుచి ఒక్కటే కాదు..! అంతకు మించి..

Coffee: ఉదయం పొద్దు పొడుస్తున్నా.. నిద్ర లేవగానే బెడ్ కాఫీ అందకపోతే కొందరికి మాత్రం తెల్లారదు. కాఫీ సిప్ చేస్తూ పేపర్ తిరగేయడం, సూర్య కిరణాలను చూస్తూ కాఫీ తాగడం ఓ మధురానుభూతి. ఉదయం నోటికి కాఫీ తాగకపోతే ఆరోజంతా కూడా ఏదో కోల్పోయినట్టే ఉంటారు. ఇది రుచి కోసం మాత్రమే కాకుండా.. మన జన్యువులు కూడా ఒక కారణం కావొచ్చని పరిశోధకులు అంటున్నారు. దీంట్లో ఉండే కెఫిన్ తో కాఫీకి ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. అదే మనకి కిక్ ఇస్తుంది. పైగా.. మనుషుల గుండె పనితీరును చక్కగా నియంత్రిస్తుందని సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ రిసెర్చర్లు చేసిన ఓ అధ్యయనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.

యూకే బయోబ్యాంక్ నుంచి సేకరించిన డేటాతో దాదాపు 4 లక్షలమంది కాఫీ తాగే వారిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరిలో రక్తపోటు, హార్ట్ రేట్ ల మధ్య తేడాలను పరిశీలించారు. వీరిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిని వేరు చేశారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరంతా డీకాఫిన్ చేసిన కాఫీని తక్కువగా తాగుతున్నారని.. కొంతమంది కాఫీకే దూరంగా ఉంటున్నారని గుర్తించారు. దీన్ని బట్టి కొన్ని రుగ్మతలలో బాధపడేవారు కాఫీకే దూరంగా ఉంటున్నారని తెలిసింది. కాఫీని ఇష్టపడటంలో మన జన్యువుల పాత్రను ఈ పరిశోధనే తెలియజేస్తోందని అంటున్నారు.

రక్తపోటు ఉన్నవారు కాఫీలోని సురక్షితమైన కెఫిన్ స్థాయిలను గుర్తించగలరని కూడా ఈ అధ్యయనంలో తేలిందని అంటున్నారు. తక్కువసార్లు కాఫీ తాగే వారితో పోలిస్తే.. ఎక్కువగా కాఫీ తాగే వారు కెఫిన్‌ను తట్టుకోగలడని అంటున్నారు. డీ కెఫినేటెడ్ డ్రింక్స్ తీసుకునేవారు, కాఫీ తాగనివారు కెఫిన్ వల్ల ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేరని కూడా అంటున్నారు. మొత్తంగా కాఫీపై మన ఇష్టాన్ని మనసుతోపాటు మన జన్యువులు కూడా ప్రేరేపిస్తాయని అంటున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఒక్కో రుచితో కాఫీ తయారు చేస్తారు. ఎలా లేదన్న పైన చెప్పినట్టు కాఫీతోనే కొందరికి తెల్లారుతుంది. అయితే.. వారివారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కొందరు కాఫీకి దూరమవుతారు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ఆహార నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్యలు, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. వారి అభిప్రాయాలకు ఈ కథనం ప్రత్యామ్నాయంకాదు. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.