ఉదయం కాఫీతో ఈ ఆహారాలు తింటున్నారా.. అయితే మీ హార్ట్ కి ఇదే ఫస్ట్ డేంజర్ అలారం..!

నిద్ర లేచిన వెంటనే చాలా మందికి గుర్తొచ్చేది రెండు విషయాలే.. ఒకటి మొబైల్, రెండోది కాఫీ. ఇది లేకుంటే ఉదయం మొదలు కాదు అనుకొనేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. అయితే ఈ అలవాటు కొన్ని ఆహారాలతో కలిసినప్పుడు మాత్రం నెమ్మదిగా మన ఆరోగ్యానే దెబ్బతీయడం మొదలుపెడుతుందట. బయటకు పెద్దగా కనిపించని సమస్యలు లోపల లోపల పెరిగి గుండె, కడుపు, రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాఫీలో సహజంగానే ఆమ్లాలు, ఉత్తేజకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంపై వెంటనే ప్రభావం చూపే లక్షణం కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలతో పాటు కాఫీ తీసుకుంటే.. ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందట. కొందరు నిపుణుల అధ్యయనాల ప్రకారం, ఈ అలవాటు జీర్ణక్రియను దెబ్బతీయడంతో పాటు రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలను కూడా పెంచే అవకాశముందని చెబుతున్నారు.

ముఖ్యంగా నారింజ, నిమ్మకాయలు లాంటి విటమిన్-సి ఎక్కువగా ఉండే పుల్లని పండ్లను కాఫీతో కలిపి తీసుకుంటే కడుపులో ఆమ్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. దీని వల్ల గుండెల్లో మంట, అజీర్ణం, పుల్లని త్రేనుపులు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, వేయించిన స్నాక్స్ లాంటి కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు కాఫీతో కలిసితే… శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మరింత పెరిగే ప్రమాదం ఉందట. దీని ప్రభావం నేరుగా గుండె ఆరోగ్యంపై పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదే క్రమంలో కొందరు ఉదయాన్నే ఉప్పు ఎక్కువగా ఉండే టిఫిన్లు తింటూ.. పైగా కాఫీ తాగడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందట. ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందట. అలాగే కేకులు, తీపి డోనట్స్ వంటి అధిక షుగర్ ఉన్న పదార్థాలను కాఫీతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరిగిపోతాయట. దీని తర్వాత శరీరం ఒక్కసారిగా నీరసంగా మారి అలసట, చిరాకు రావడం కూడా సాధారణమైపోతుందట.

మరోవైపు కాఫీని రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలోని కాల్షియంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కాఫీ తాగే వారు కేవలం డికాక్షన్ కాకుండా కొద్దిగా పాలు కలిపి తీసుకుంటే ఈ ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

మొత్తానికి చెప్పాలంటే.. కాఫీ తాగడం తప్పు కాదు, కానీ ఏ ఆహారాలతో కలిపి తాగుతున్నామన్నదే అసలు కీలకం. ఉదయాన్నే చేసే చిన్న అలవాటే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి ఈరోజు నుంచి అయినా కాఫీతో పాటు తాగే ఆహారంపై ఒకసారి జాగ్రత్త మహించాలి.