రోజుకు 5 కప్పుల టీ–కాఫీ తాగుతున్నారా.. ఒక నెలలో శరీరంలో జరిగేది చూసి షాక్ అవుతారు..!

రోజూ ఉదయం లేవగానే కప్పు కాఫీ లేదా టీ లేకపోతే చాలా మందికి రోజు గడవదు. పని ఒత్తిడి, అలసట, నిద్రమత్తును పారద్రోలి పెట్టే ఈ రెండు పానీయాలపై ఆధారపడటం రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాదు, కొందరైతే రోజుకు నాలుగైదు కప్పులు కాఫీ, టీ తాగడం సర్వసాధారణమే అయిపోయింది. కానీ ఒక్కసారి ఆలోచించండి.. ఇలా రోజూ అధికంగా కాఫీ–టీ తాగితే మీ శరీరం లోపల ఏమి జరుగుతుందో తెలుసా? నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం ఆందోళన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కాఫీ, టీ రెండిటిలోనూ కెఫిన్ ఉంటుంది. కానీ కాఫీలో దాని మోతాదు గణనీయంగా ఎక్కువ. కెఫిన్ మొదటి దశలో శరీరానికి ఎనర్జీని ఇస్తుంది, అలర్ట్‌గా ఉంచుతుంది. అయితే రోజూ 5 కప్పులకుపైగా తీసుకుంటే శరీరం కెఫిన్‌కు అలవాటు పడిపోతుంది. మొదట ఇచ్చే హాయి తర్వాతి రోజుల్లో తగ్గిపోతూ.. అదే ఎనర్జీ రావడానికి మరింత కెఫిన్ అవసరమవుతుంది. ఇలా నెమ్మదిగా కెఫిన్ డిపెండెన్సీ పెరుగుతుంది. పని తగ్గినప్పటికీ ఒత్తిడి ఎక్కువగా అనిపించడం, బాడీ రిలాక్స్ కాకపోవడం, నిద్ర దూరమవడం జరుగుతుంది.

టీ విషయానికి వస్తే.. టీలో ఉన్న L-థయనిన్ మనసుకు శాంతి ఇవ్వడం ద్వారా స్థిరమైన ఎనర్జీని ఇస్తుంది. కాఫీతో వచ్చే అకస్మాత్తు ఎనర్జీ పీక్స్, తర్వాత వచ్చే క్రాష్‌లతో పోలిస్తే టీ మరింత సమతుల్య ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాఫీ ఎక్కువగా తాగే వారిలో ఆందోళన, అసహనం ఎక్కువగా కనిపిస్తాయి. అధిక కెఫిన్ మరో కీలకమైన విషయాన్ని ప్రభావితం చేస్తుంది.. శరీరపు పోషక శోషణను. భోజనం తర్వాత వెంటనే కాఫీ తాగితే ఐరన్ శోషణను అడ్డుకుంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఎక్కువ మోతాదులో టీ తాగితే అందులోని టానిన్లు ఐరన్‌ను కణాలకు చేరకుండా అడ్డుకుంటాయి. చిన్నారులు, మహిళలు, రక్తహీనతకు గురయ్యే వారు ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

బ్లడ్ ప్రెజర్ ఒకటి.. అధిక కెఫిన్ తీసుకుంటే ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, ఆందోళన, చెమటలు పట్టడం. ముఖ్యంగా ఇప్పటికే హార్ట్ సమస్యలు ఉన్నవారు కెఫిన్ మీద అధికంగా ఆధారపడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకో ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డీహైడ్రేషన్. టీ, కాఫీ రెండూ మూత్ర విసర్జనను పెంచుతాయి. తగినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నీటిని ఎక్కువగా తాగడం తప్పనిసరి.

ఇక నిద్ర విషయానికి వస్తే.. పడుకునే ముందు కాఫీ లేదా టీ తాగడం నిద్రను గంటలకొద్దీ దూరం చేస్తుంది. నిరంతరం రాత్రులు ఇలా గడిపితే స్లీప్ సైకిల్ పూర్తిగా దెబ్బతింటుంది. తర్వాత ఉదయం అలసట, రోజు మొత్తం మూడ్ స్వింగ్‌లు రావడం కూడా సహజమే. నిద్ర సమస్యలు ఉన్నవారు కెఫిన్‌ను పూర్తిగా తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

కెఫిన్ మానేయడం కష్టమే అనిపించవచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయాలున్నాయి. హెర్బల్ టీలు, డీకాఫ్ కాఫీలు, గ్రీన్ టీ వంటి వాటిని ఎంచుకోవచ్చు. ఇవి కెఫిన్ మోతాదును తగ్గిస్తూ శరీరానికి సహజ శక్తిని అందిస్తాయి. నిపుణులు చెబుతున్న తేలికైన గణాంకం.. రోజుకు పెద్దవారు 300–400 మిల్లీ గ్రాముల కెఫిన్‌కంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే 3–4 కప్పుల కాఫీ లేదా 6–8 కప్పుల టీ. దీనికంటే ఎక్కువైతే శరీరం నెమ్మదిగా దాని ప్రతికూల ప్రభావాలను చూపడం మొదలుపెడుతుంది. కాబట్టి.. ఒక్క కప్పు ఏం అవుతుంది.. అనుకునే అలవాటు కొద్దికొద్దిగా రోజువారీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని గుర్తించాలి. నియంత్రణతో టీ–కాఫీ తాగితే అవి శరీరానికి లాభం. కానీ అదుపు తప్పితే.. శరీరం మెల్లగా అలారం మోగించడం మొదలుపెడుతుంది.