మీ కళ్లు పదేపదే అదురుతున్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే!

సాధారణంగా కనురెప్పలు అదురుకోవడం అనేది నిరపాయకరం మరియు తాత్కాలికం అనే సంగతి తెలిసిందే. అయితే తరచుగా మరియు దీర్ఘకాలంగా కనురెప్పలు అదురుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కంటి మయోకిమియా, కంటి ఒత్తిడి, అలసట, ఒత్తిడి, మరియు కెఫిన్ తీసుకోవడం వంటి కారణాల వల్ల కళ్లు అదరడం జరుగుతుంది. నిరంతరం కళ్ళు అదురుతుంటే, అది బ్లెఫరోస్పాస్మ్ లేదా ఇతర నరాల సంబంధిత సమస్యలకు సూచన అయ్యే ఛాన్స్ ఉంది.

చాలా సందర్భాలలో కళ్ళు అదురుకోవడం దానంతట అదే తగ్గిపోతుంది. కళ్ళు అదురుకోవడం దీర్ఘకాలంగా ఉంటే లేదా ఇతర లక్షణాలతో కలిసి ఉంటే, వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మెదడు లేదా నరాల లోపాల వల్ల కూడా కళ్లు అదిరే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని చెప్పవచ్చు.

అధిక ఒత్తిడి సమస్యతో బాధ పడేవాళ్లలో సైతం ఈ లక్షణం కనిపిస్తుందని. విటమిన్ బి, విటమిన్ సి లోపాలతో బాధ పడే చాలామందిలో సైతం ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సమయం పాటు మొబైల్, ల్యాప్ టాప్ లను చూసినా కళ్లు అదరడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నిద్రలేమి వల్ల కూడా కళ్లు అదురుతాయి. కాఫీ, చాక్లెట్లు, కెఫిన్ ఉండే పదార్థాలు తినేవాళ్లలో కూడా ఈ సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి.

ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే సంగతి తెలిసిందే. అందువల్ల కంటి విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.