వర్షాకాలంలో దగ్గు జలుబు సమస్యలు వెంటాడుతున్నాయా.. వీటితో చెక్ పెట్టండి?

ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఎక్కువగా వర్షాలు పడటమే కాకుండా వాతావరణంలో కూడా చాలా తేమ ఉండటం వల్ల తొందరగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు జలుబు దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు.ఈ విధంగా జలుబు దగ్గు సమస్యతో బాధపడేవారు ఇంగ్లీష్ మందులను వాడుతున్నప్పటికీ కొందరిలో ఏ మాత్రం మార్పు ఉండదు.అయితే వర్షాకాలంలో ఈ విధమైనటువంటి సమస్యతో అధికంగా బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందండి. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

దగ్గు జలుబు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల తొందరగా దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా అల్లం తులసితో తయారుచేసిన టీ తరచు తాగటం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

మన ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి తిప్పతీగ ఇలాంటి వ్యాధులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తిప్పతీగల ఆకులతో కషాయం చేసుకొని తాగటం వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా యూకలిప్టస్ ఆయిల్ తో బాగా ఆవిరి పెట్టడం వల్ల తొందరగా దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గడమే కాకుండా ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.వీటితోపాటు మనం తీసుకునే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి ఎప్పటికప్పుడు వేడిగా తయారు చేసుకొని తినాలి అంతేకానీ ఉదయం చేసినది రాత్రికి తినడం వల్ల ఇలాంటి రోగాలు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.