వర్షం వస్తే ఆస్తమా పెరుగుతుందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఊపిరి కష్టాలు దూరం..!

వర్షం పడుతుందంటే కొంతమందికి ఆనందం. కానీ ఆస్తమా ఉన్నవాళ్లకు మాత్రం అది కాస్త భయమే. ఎందుకంటే ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తేమతోపాటు దుమ్ము, అలర్జీ కణాలు గాల్లో తిరుగుతూ ఊపిరితిత్తులను ఇబ్బంది పెడతాయి. ఫలితంగా ఆయాసం, దగ్గు, ఛాతీ బరువుగా అనిపించడం ఎక్కువవుతుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు ‘మాన్‌సూన్ ఆస్తమా’ అని అంటారు.

తడి గోడలు, తడి కార్పెట్లు, ఇక బూజు, దుమ్ము దూళి పెరిగి గాలిలో కలుస్తాయి. వాటి సూక్ష్మకణాలు లంగ్స్‌లోకి వెళ్ళి ఊపిరి తీసుకోవడం కష్టంగా చేస్తాయి. వర్షాకాలంలో పుప్పొడి రేణువులు కూడా గాలిలో ఎక్కువగా తిరుగుతాయి. ఉరుములతో కూడిన వర్షం సమయంలో అవి ఊపిరి రూపంలో మనలో చేరి.. లంగ్స్‌లోకి త్వరగా చేరి తీవ్రమైన ఆస్తమా ఎటాక్‌కి కారణం అవుతాయి.

అయితే ఈ సమయంలో తేమ తగ్గించడం చాలా ముఖ్యం. కిచెన్, బాత్రూం వంటివాటిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడాలి. అవసరమైతే డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. పరుపులు, కర్టెన్లు వారానికి ఒకసారి వేడి నీటితో కడగాలి. ఇంట్లో దుమ్ము, బూజు ఎక్కువైతే HEPA ఫిల్టర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ వాడాలి. గోడల నుంచి నీటి లీకేజ్ ఉంటే వెంటనే సరిచేయాలి. కనిపించే బూజును వెంటనే డిస్‌ఇన్‌ఫెక్టెంట్ తో క్లీన్ చేయాలి.

పుప్పొడి రేణువులు ఎక్కువగా ఉన్న రోజుల్లో, ఉరుములతో వర్షం వచ్చే రోజుల్లో కిటికీలు మూసి ఇంట్లోనే ఉండటం మంచిది. డైట్‌లో విటమిన్-C పండ్లు, తులసి-అల్లం టీ, వేడి సూప్‌లు తీసుకోవాలి. కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీమ్‌, ఎండు పదార్థాలు ఎక్కువ తినకూడదు. ఇవి శ్లేష్మాన్ని పెంచి ఊపిరితిత్తులకు పని పెడతాయి.

రోజూ కొన్ని నిమిషాలు డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం చేయడం కూడా ఉపయోగకరం. లంగ్స్ బలంగా ఉంటే ఊపిరి తీసుకోవడం సులభం అవుతుంది. ముఖ్యంగా డాక్టర్ ఇచ్చిన మందులు ఎప్పుడూ మానకూడదు. ఇన్‌హేలర్ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. ఎక్కువ ఇన్‌హేలర్ వాడాల్సి వస్తే లేదా ఎక్కువ ఆయాసం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలోనూ ఆస్తమా రోగులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.