వర్షాకాలం రాగానే పాముల సంచారం గణనీయంగా పెరుగుతుంది. పొలాలు, పొదలు, ఇళ్ల వెనుక భాగాలు, గుడిసెల చుట్టుపక్కల ఆహారం కోసం పాములు తిరుగుతుంటాయి. ముఖ్యంగా కప్పలు, ఎలుకలు వేటాడుతూ ఇవి మనిషికి దగ్గరగా వచ్చేస్తాయి. ఈ సమయంలో తెలియక అడుగుపెట్టి పాములపై పడితే లేదా అజాగ్రత్తగా నడిచినప్పుడు కాటు వేసే ప్రమాదం ఉంది.
ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పాము కాట్లకు గురవుతున్నారు. ఇందులో ఎక్కువగా రైతులు, పిల్లలు, మహిళలే ఉంటారు. పాములన్నీ విషపూరితమైనవే కావు. కానీ రక్తపింజర, తాచుపాము, కట్లపాము, నాగుపాము వంటి కొన్ని మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఇవి కరిస్తే సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పాము కాటు వేయగానే ముందుగా అది ఎక్కడ కాటేసిందో స్పష్టంగా గుర్తించాలి. కాటువేసిన చోట రెండు గాట్లు మాత్రమే కనిపిస్తే, అది సాధ్యమైనంత విశపూరిత పాము కాటుగా భావించాలి. చాలా విషపూరిత పాములు రెండు పదునైన దంతాలతో కరిస్తాయి. ఎక్కువ గాట్లు ఉంటే సాధారణ పాము అని అనుకోవచ్చు. అప్పటికప్పుడు బాధితుడిని నిశ్చలంగా ఉంచాలి. శరీరాన్ని ఎక్కువ కదిలించకుండా చూసుకోవాలి. ఎందుకంటే కదలికల వల్ల విషం త్వరగా రక్తంలోకి వెళ్లే అవకాశముంది. బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలి. పాము ఏ రకానికి చెందిందో తెలిసుంటే, చికిత్స త్వరగా సాగుతుంది. అందుకోసం పామును హానీ చేయకుండా సెల్‌ఫోన్ తో ఫొటో తీయడం మంచిది.
కాటు వేసిన చోట నోటితో పీల్చడం, కోయడం, మసాజ్ చేయడం, కట్టుకట్టడం వంటి చర్యలు చాలా ప్రమాదకరం. ఇవి బాధితుని పరిస్థితిని మరింత తీవ్రమవేలా చేస్తాయి. అలాగే నాటు వైద్యానికో, మంత్రాలకో వెళ్లకుండా వైద్యుల వద్ద చికిత్స తీసుకోవడం అత్యవసరం. వర్షాకాలంలో పొదలు ఎక్కువగా పెరిగిన చోట నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాదరక్షలు ధరించడం, రాత్రిళ్లు టార్చ్ ఉపయోగించడం లాంటి అలవాట్లు ప్రమాదాలను నివారించగలవు. జాగ్రత్తగా ఉండటం వల్లే ప్రాణాలు కాపాడుకోవచ్చు.