వర్షాకాలంలో ఈ కూరగాయలు ఆరోగ్యానికి హానికరం.. వైద్యుల సూచనలు ఇవే..!

వర్షాకాలం వచ్చినప్పటి నుంచి.. తడి వాతావరణంగా చికాకు పెడుతుంటుంది. ఈ కాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా మనం తినే ఆహారం, కూరగాయల వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వర్షాకాలంలో ఎలాంటి కూరగాయలను తగ్గించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈ సమయంలో ఎక్కువ నీటి శాతం ఉన్న కూరగాయలు త్వరగా పాడైపోతాయి. ఉదాహరణకు బీరకాయ, సొరకాయ. ఇవి బయట బాగా కనిపించినా లోపల మాత్రం పాడవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని వర్షాకాలంలో తక్కువగా వాడడం మంచిది. మరోవైపు ముల్లంగి వంటివి నేలలో పెరుగుతాయి. వర్షంలో మట్టి తడిగా మారి వ్యాధికారక జీవులు ఎక్కువగా ఉంటాయి. అవి కూరగాయల మీద ఉండి జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి. అలాగే పచ్చి కూరగాయలు కూడా వర్షాకాలంలో పెద్ద ప్రమాదమే. వీటిని శుభ్రం చేయకపోతే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనేది నిజం. కానీ వర్షాకాలంలో ఇవి ఎక్కువగా మట్టి, ఫంగస్ వంటివి కలిగి ఉండే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. అంతే కాకుండా మష్రూమ్స్ కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి కానీ అవి త్వరగా పాడవుతాయి. విషపూరితంగా మారే ప్రమాదం ఉన్నందున వీటిని కూడా దూరం పెట్టడం మంచిది.

నిపుణుల సూచన ప్రకారం.. వర్షాకాలంలో నీటి శాతం తక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి. బాగా ఉడికించి మాత్రమే తినాలి. పాడైనది అనిపిస్తే వెంటనే వదిలేయాలి. వీటితో పాటు వర్షాకాలంలో శరీరం కొంచెం బలహీనంగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకుని ఆహారాన్ని ఎప్పుడూ శుభ్రంగా, వేడి గా తీసుకోవడం శ్రేయస్కరం.