ఫ్రిజ్ లో చాక్లెట్స్, బ్రెడ్, కేక్ పెట్టొచ్చా..?

నేడు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఉంటోంది. కొత్త కొత్త టెక్నాలజీతో రిఫ్రిజిరేటర్లు తయారవుతున్నాయి. క్షణాల్లో ఐస్ క్యూబ్స్, స్పేస్ ఎక్కువ, 4 డోర్.. ఇలా ఆకర్షణీయ పద్ధతుల్లో ఫ్రిజ్ లు వచ్చాయి. అయితే.. ఫ్రిజ్ ఉంది కదా అని అన్ని పదార్ధాలను అందులో ఉంచలేం.. ఉంచకూడదు కూడా. అలా ఉంచకూడనివి కొన్ని ఉన్నాయి. వాటిలో కూరగాయలు, చాక్లెట్స్, డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిజ్ లో పెడితేనే ప్రమాదం. 

కూరగాయల్లో టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఫ్రిజ్ లో ఉంచకూడదు. టమాటాలు చల్లటి ప్రదేశాల్లో ఉంచితే పాడైపోతాయి. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల టమాటాలు మెత్తగా, నీరు పట్టినట్టుగా తయారై ఉబ్బిపోతాయి. వాటి ఫ్లేవర్ కూడా పోతుంది. ఉల్లిపాయలు తడి ప్రదేశాల్లో ఉంచితే మొలకలు వచ్చేస్తాయి. గాలి బాగా తగిలేలా డ్రై ప్రదేశాల్లోనే ఉంచాలి. ఉల్లిలో పిండిపదార్థం ఉండటంతో ఫ్రిజ్‌లో పెడితే పాడైపోతాయి. కోసిన ఉల్లిపాయలు ఉంటే.. గిన్నెలో మూతపెట్టి పెట్టొచ్చు. బంగాళాదుంపల్ని ఫ్రిజ్‌లో పెడితే మొత్తగా అయిపోతాయి.. చెడిపోతాయి కూడా. వాటిలోని పిండిపదార్థం షుగర్‌గా మారుతుంది. వీటిని తింటే అందులో తయారైన ఎక్రిలామైడ్ అనే రసాయనం మన నరాలను పాడు చేస్తుంది. కండరాలను బలహీనం చేస్తుంది.

బ్రెడ్, రొట్టె ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఓపెన్ ప్లేస్ లో పొడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచాలి. చాకొలెట్స్‌ని ఫ్రిజ్ లో ఉంచితే గట్టిపడతాయి. చల్లబడి ఒరిజినల్ ఫ్లవర్, కలర్ కూడా మారే అవకాశం ఉంది. ఫ్రిజ్ లో పెట్టే బదులు డ్రై, చల్లటి ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. కేక్స్‌ని ఇంట్లో తయారు చేసుకున్నా.. కొని తెచ్చుకున్నా ఫ్రిజ్ లో పెడతాం. షాపుల్లో  కూడా ఫ్రిజ్‌లోనే పెడతారు. అలాకాకుండా గాలి చేరని టిన్, లేదా కేక్ టిన్‌లో ఉంచడం మంచిది. అలా అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది.

సలాడ్ లు కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఫ్రిజ్ లో ఉంచకూడని వాటిలో తేనె ఒకటి. గడ్డ కట్టేస్తుంది. బెల్లం ముద్దల్లా అవుతుంది. నూనెను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. పొడి ప్రదేశాల్లో ఉంచాలి. ఆలివ్ ఆయిల్ కు ఎండ తగిలితే పాడవుతుంది. కిచెన్‌లోని కప్ బోర్డ్‌లో ఉంచొచ్చు. కాఫీకి చుట్టుపక్కల ఉండే వాసనల్ని పీల్చే గుణం ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే సహజ ఫ్లేవర్ పోతుంది. నీడ, చీకటి ప్రదేశాల్లో ఉంచాలి.

 

గమనిక: మీ అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు అందించడం జరిగింది. అర్హత ఉన్న ఆహార నిపుణుల వివరాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు. గమనించగలరు.