రాగి జావాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనా? ఇందులో నిజం ఎంత?

తృణధాన్యాల్లో ఒకటైన రాగులను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభించడంతోపాటు విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడతాయి. మన పూర్వికులు రోజువారి ఆహారంలో రాగులతో చేసిన ఆహారాన్ని తీసుకొని వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ప్రస్తుతం అధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఉన్న బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటూ 40 సంవత్సరాలకే షుగర్, బీపీ ,గుండెపోటు, ఉపకాయం వంటి సమస్యలతో ఎక్కువ శాతం మంది బాధపడుతున్నారు.

ప్రస్తుత ఒక క్షణం తీరికలేని జీవనంలో ప్రతిరోజు రాగి రొట్టె, రాగిసంగటి వంటి ఆహారంగా తీసుకోవడం కొంత కష్టమే.అందుకే ప్రతిరోజు రాగి జావను తయారు చేసుకుని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగి జావా సులువుగా తొందరగా తయారు చేసుకోవచ్చు దీనికోసం రాగులను పిండిగా తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటే మనకు ఇష్టమైనప్పుడు తగినంత రాగి పొడిని గ్లాసుడు నీళ్లలో కలిపి బాగా మరగనిచ్చి అందులో కొంత చక్కర లేదా ఉప్పును వేసుకొని ప్రతిరోజు సేవించవచ్చు. ప్రతిరోజు రాగి జావని సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు రాగిజావను సేవిస్తే ఇందులో పుష్కలంగా లభించే ఐరన్, జింక్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అధికంగా పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అలసట, నీరసం ,చికాకు వంటి సమస్యలు తొలగి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. కాల్షియం ఫాస్ఫరస్ సమృద్ధిగా లభించి దంతాలను ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. రాగుల్లో సహజంగా లభించే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక శారీరక శ్రమ చేసే వారికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది.