అధిక ఒళ్ళు నొప్పులు వేధిస్తున్నాయా….. ఇవే కారణాలు కావచ్చు!

ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా బాధపడుతున్న సమస్యలలో ఒళ్ళు నొప్పుల సమస్య ఒకటి. ఇలా తరచూ ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు అసలు కారణం గ్రహించకుండా నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పారాసెట్మాల్, డైక్లోఫినాక్, వంటి పెయిన్ కిల్లర్లను అధికంగా వినియోగిస్తుంటారు. ఇలా విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్ మాత్రాలను వినియోగించడం వల్ల తక్షణం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు ఏమో కానీ దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. తరచూ ఒళ్ళు నొప్పులు రావడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చలికాలం లేదా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో తగిన శక్తి లోపించి నీరసం వల్ల ఒళ్ళు నొప్పుల సమస్య రావచ్చు. శరీరంలో ఇన్ఫెక్షన్ రేటు తగ్గిన వెంటనే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి. మన శరీరంలోని ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి శరీర పనితీరు మెరుగుపరడానికి విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే తరచూ ఒళ్ళు నొప్పులు సమస్య వేధిస్తుంది. మన శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థకు ఐరన్ మూలకం కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపిస్తే మన శరీర అవయవాలకు అవసరమైన పోషకాలు ఆక్సిజన్ సరిగా అందక ఒళ్ళు నొప్పుల సమస్య వస్తుంది.

అధిక ఒత్తిడి, నిద్రలేమి సమస్య వంటివి శారీరక మానసిక అనారోగ్యానికి కారణం అవుతాయి. అధిక ఒత్తిడి కారణంగా మన శరీరంలో జీవక్రియ రేటు తగ్గి శరీర అవయవాలు అలసిపోతాయి. దాంతో మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి నీరసం, అలసట వంటి సమస్యలతో తరచూ ఒళ్ళు నొప్పుల సమస్యలు తలెత్తుతుంటాయి. ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో ఎక్కువగా కీళ్లనొప్పులు ఒళ్ళు నొప్పులు సమస్య అధికంగా ఉంటుంది. నీళ్లను తక్కువగా తాగితే మన శరీరానికి తగినంత నీరు లభించక డిహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. దాంతో అవయవాల పనితీరులో వ్యత్యాసం ఏర్పడి నీరసం, ఒళ్ళు నొప్పుల సమస్య ఏర్పడుతుంది.అందుకే తరుచూ ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు సొంత వైద్యం చేసుకోకుండా ముందుగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.