మన సంపూర్ణ ఆరోగ్యానికి వేడి పాలు మంచిదా… చల్లని పాలు మంచిదా?

మనలో పోషకాహార లోపాన్ని సరి చేసుకోవడానికి
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటు అదనపు పోషకాహారం కోసం ఒక గ్లాసు పాలు తాగడం వల్ల నిత్యం ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చునని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్స్ ,మినరల్స్ , కార్బోహైడ్రేట్స్ వంటివి పాలల్లో పుష్కలంగా ఉంటాయి.
అలాగే శరీర పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం మెగ్నీషియం ఫాస్పరస్ జింకు వంటి మూలకాలు సమృద్ధిగా ఉన్నాయి.

ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగితే శరీర పెరుగుదలతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పాలను తాగే విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. అవేంటంటే ప్రతిరోజు మనం వేడిపాలు తాగితే ఆరోగ్యానికి మంచిదా లేక చల్లని పాలు తాగితే మన ఆరోగ్యానికి మంచిదా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం.

కొన్ని అధ్యయనాల ప్రకారం వేడి పాలు తాగిన చల్లని పాలు తాగిన మన శరీరానికి కావలసిన సకల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. తేడా ఏమీ ఉండదు. కాకపోతే మన శరీర తత్వాన్ని, వాతావరణ పరిస్థితులను బట్టి వేడి పాలు తాగడం లేదా చల్లని పాలు తాగడం వంటివి చేస్తుండాలి. ముఖ్య విషయం ఏమిటంటే పచ్చిపాలను మాత్రం అస్సలు తాగకండి. పచ్చి పాలలో అనేక వ్యాధికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు ఉండడం వల్ల మనలో అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. పాలను బాగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లగా ఉన్నప్పుడైనా నిక్షేపంగా తాగొచ్చు.

గుండె జబ్బులు, రక్తపోటు, కీళ్లనొప్పులు వంటి సమస్యతో బాధపడేవాళ్లు పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో అత్యధికంగా కొవ్వు ఉంటుంది కాబట్టి.చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మన జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది.వేడి పాలను తాగడం వల్ల ఇందులో ఉండే కొవ్వు పదార్ధం సులువుగా జీర్ణం అవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలు తాగితే సుఖప్రదమైన నిద్ర కలిగి నిద్రలేమి సమస్య తొలగుతుందని వైద్యులు చెబుతున్నారు
రాత్రి సమయాల్లో చల్లని పాలు తాగితే జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కావున గోరువెచ్చని పాలు తాగడం మన ఆరోగ్యానికి మంచిది.