సంక్రాంతి స్పెషల్ పొంగలి ప్రాముఖ్యత.. ఆరోగ్య ప్రయోజనాలివే!

సంక్రాంతి పండుగను మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మూడు రోజులపాటు ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. సంక్రాంతి రైతులకు పెద్ద పండుగ రైతులు కష్టపడి పండించిన ధాన్యాలు ఇంటికి చేరే సమయంలో రైతులు ఎంతో ఉత్సాహంగా ఇంటిని, పశువులను అలంకరించి పండుగ జరుపుకుంటారు.భారతదేశం అంతటా ఒకే పండుగను జరుపుకున్నప్పటికీ వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉత్తరాన లోహ్రీ, దక్షిణాన పొంగల్, పశ్చిమ ప్రాంతంలో మకర సంక్రాంతి, గుజరాత్‌లో ఉత్తరాయణం ఇలా ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతోపాటు తమిళనాడు, పాండిచ్చేరి, కేరళలో రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగలో భాగంగా
కొత్త పంట ధాన్యాలతో ఈ పొంగల్ వంటకాన్ని తయారు చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పొంగల్ ఎంతో ప్రాచుర్యం పొందింది.పొంగలి లేదా హగ్గి అని కూడా అంటారు. తమిళంలో పొంగల్ అంటే ఉడకబెట్టడం లేదా బుడగ పెట్టడం. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పొంగలి తయారీ విధానం ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరి ఇండ్లలో తయారు చేసుకునే రుచికరమైన పొంగల్ ని వెన్ పొంగల్ , కట్టెపొంగలి అని అంటారు. దీని తయారీకి నెయ్యిని ఉపయోగిస్తారు. బియ్యం, పెసరపప్పు, కొన్ని మిరియాలు, జీడిపప్పు, మిరపకాయలు, జీలకర్ర జతచేసి స్పైసీగా తయారు చేస్తారు. ఈ వంటకం ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది.ఒక కప్పు వెన్ పొంగల్‌లో 212 కేలరీలు ఉంటాయి, వీటిలో 116 కేలరీలు కార్బోహైడ్రేట్లు, 22 కేలరీలు ప్రోటీన్, 74 కేలరీలు కొవ్వు ఉంటుంది. సగటు రోజువారి కేలరీలలో సుమారు 11 శాతం అందిస్తుందనీ నిపుణులు చెబుతున్నారు.

పొంగలి లో ఉపయోగించే ఆహార పదార్థాలు అన్నింటిలో సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్సు, ప్రోటీన్స్ విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి కావున ఈ చలికాలంలో మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా వచ్చే అన్ని ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా చలికాలంలో జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. పొంగలిని ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.