పొన్నగంటి ఆకుకూర ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

సహజ సిద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే పొన్నగంటి ఆకుకూరలో ఎంతో విలువైన ఔషధ గుణాలతో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పొన్నగంటి మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర. ఈ మొక్క ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలను గ్రహించిన మన పూర్వీకులు వారి రోజువారి ఆహారంలో ఉపయోగించారు.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో పొన్నగంటి ఆకు మరియు ఈ మొక్క ఆకుల నుంచి లభించే నూనెతో ప్రమాదకర మొండి వ్యాధులను సైతం అదుపు చేయవచ్చునని ఆయుర్వేద గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. కంటి చూపును కోల్పోయిన వారికి తిరిగి కంటి చూపును తెప్పించే అద్భుత అంతుచిక్కని ఔషధ గుణాలు పొన్నగంటి ఆకుల్లో ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

పొన్నగంటి ఆకులను పప్పు లేదా ఇతర వంటకాలతో కలిపి కాకుండా పొన్నగంటి ఆకుకూరను మాత్రమే ఫ్రై చేసుకుని చక్కని రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొన్నగంటి ఆకుకూరలో
రైబోఫ్లెవిన్,బీటా కెరోటిన్, విటమిన్ ఏ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. కావున తరచూ ఈ ఆకుకూరను ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో విషపదార్థాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

శీతాకాలంలో ఎక్కువగా బాధించే ఆస్తమా, బ్రాంకైటీస్‌ , ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేయడానికి పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా తేనెను కలుపుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పొన్నగంటి తాజా ఆకుల రసంలో వెల్లుల్లి రసం కలుపుకొని సేవిస్తే పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని సేవిస్తే సెక్స్ సామర్థ్యం పెరగడంతో పాటు వీర్యకణాభివృద్ధి కూడా జరుగుతుంది.

తరచూ పొన్నగంటి ఆకుకూరను ఆహారంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మొలల సమస్యతో బాధపడే వారికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ ఆకుల్లో ఐరన్ పోలేట్ ఎక్కువగా ఉంటుంది కావున దీని ఆహారంగా తీసుకుంటే ప్రమాదకర రక్తహీన సమస్యను కూడా అధిగమించవచ్చు.