రోజురోజుకు పెరుగుతున్న గాలి కాలుష్యం కారణంగా అనేక శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు ముక్కుదిబ్బడ, ముక్కు కారడం వంటి సమస్యలు తలెత్తి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా తరచూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలి. గాలి కాలుష్యం, తడి వాతావరణం కారణంగా ప్రమాదకర బ్యాక్టీరియా , వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ముక్కు లోపలి పొరను ఇన్ఫెక్షన్ కు గురిచేసి తీవ్రమైన నొప్పి ,వాపును కలగజేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తరచూ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ రోజులు ఉండడం వల్ల ముక్కు లోపలి పొరలో వాపు వచ్చి కొయ్య కండలు పెరుగుతాయి. అధిక జ్వరం, జలుబు సమస్యతో ఎక్కువ రోజులు బాధపడితే ముక్కు లోపల కండరాలు పెరుగుతాయి. దీంతో తరచూ ముక్కులో నీరు కారడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. వాసన గ్రహించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. తరచూ తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ముక్కు లోపలి పొరలు దురద, మంట వంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని వేధిస్తాయి.
జలుబు లేకపోయినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే ముక్కు లోపలి పొరలో పాలిప్స్ పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సైనస్ సర్జరీతో పాలిప్స్ ను తొలగించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలుగుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు శీతాకాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. బయటి వాతావరణంలో తిరిగేటప్పుడు గాలి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి తరచూ మాస్కులు తప్పనిసరిగా వాడాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించకుంటే ఈ సమస్య మళ్లీ మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది.