మనలో చాలామంది జ్వరం వచ్చిందని అనిపిస్తే మొదట పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వేసుకుంటారు. జ్వరంతో బాధ పడుతూ డాక్టర్ దగ్గరకు వెళ్లినా డాక్టర్ సైతం పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలని సూచిస్తారు. చిన్నపిల్లలు, పెద్దలకు సేమ్ ట్యాబ్లెట్ కాగా వయస్సును బట్టి ఉపయోగించే మోతాదు అయితే మారుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వాడటం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఈ ట్యాబ్లెట్ ను ఇష్టానుసారం తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లలో ఈ ట్యాబ్లెట్ కిడ్నీ సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా పారాసెటమాల్ అధిక జ్వరం, నొప్పి నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి.
కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, పంటి నొప్పులు మరియు జలుబు సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. తేలికపాటి నుండి మితమైన నొప్పికి చికిత్స చేయడానికి ఔషధంగా పారాసెటమాల్ ను వినియోగిస్తారు. చిన్న చిన్న నొప్పులకు సైతం ఈ టాబ్లెట్ ను వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
ఈ టాబ్లెట్ ను అతిగా వాడటం వల్ల లివర్ పై ఒత్తిడి పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బీపీ సమస్యతో బాధ పడేవాళ్లకు ఈ టాబ్లెట్ మంచిది కాదు. ఈ టాబ్లెట్ ను ఎక్కువగా వాడితే గాస్ట్రిక్ బ్లీడింగ్ సమస్య వేధిస్తుంది. ఈ ట్యాబ్లెట్ కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. గర్భిణీ మహిళలు వైద్యుల సలహాలు తీసుకోకుండా ఈ ట్యాబ్లెట్ ను వాడకూడదు.