నేటి ఆధునిక జీవన గమనంలో ప్రతి ఒక్కరూ కాలంతో పోటీ పడాల్సి వస్తోంది ఫలితంగా మానసిక ఒత్తిడి పెరిగి మానసిక స్థిరత్వం లోపించి ప్రమాదకర మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు.మానసిక రుగ్మతలకు కారణాలను పరిశీలిస్తే ఆర్థికపరమైన కారణాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, కుటుంబ కలహాలు,నిరుద్యోగం,పని ఒత్తిడి వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలం డిప్రెషన్ సమస్యలతో ఇబ్బంది పడితే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాలు తప్పవనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవారిలో అనుక్షణం కొన్ని లక్షణాలను గమనించవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి చిన్న కారణానికి ఎక్కువగా అరవడం లేదా ఎక్కువగా ఆలోచించడం, ఏ పని పైన ఉత్సాహం లేకపోవడం, తరచూ నిరాశతో మాట్లాడడం, తప్పు చేశామన్న భావనతో కలిగి ఉండడం, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, రాత్రులు ఒంటరిగా కూర్చుని ఏడవడం,ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న భావన కలగడం వంటి తీవ్రమైన ఆలోచనలను కలిగి ఉంటారు. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించిన వెంటనే వైద్య సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు.
దీర్ఘకాలం పాటు మానసిక రుగ్మతలతో సతమతమైతే దానికి తోడు బిపి, గుండెపోటు, ఉబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా దృఢత్వం పొందడానికి ప్రతిరోజు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార నియమాలను వైద్య సలహాలు తీసుకొని పాటించాలి. అలాగే కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, ప్రాణయామం, మెడిటేషన్, మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం వంటివి అలవాటు చేసుకుంటే మానసిక అలసట తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెడు ఆలోచనల నుంచి దృష్టి మరల్చడానికి ప్రతిక్షణం మీ మిత్రులతోనూ బంధువులతోనే గడపడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తే సరిపోతుంది.