సాధారణంగానే శీతాకాలం లాంటి తడి సీజన్లలో వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. దానికి తోడు మనలో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండడం వల్ల తొందరగా వ్యాధికారకాలు మన శరీరంలో వ్యాప్తి చెంది తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. సహజంగానే గర్భిణీ స్త్రీలలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి తొందరగా ప్రమాదకర ఇన్ఫెక్షన్, అంటు వ్యాధులు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఈ శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు రోజువారి దిన చర్యలు మరియు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చలికాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకొని రోజంతా పడుకోవాలి అనిపిస్తుంది. ఈ అలవాటు మంచిది కాదు అంటున్నారు నిపుణులు ముఖ్యంగా గర్భవతులు రోజంతా పడుకుంటే కండరాలు, కీళ్లు పట్టేసినట్టు అనిపించి వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకే భంగిమలో ఎక్కువ సేపు పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల పాదాలలో వాపు వస్తుంది. శరీరం చురుకుగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు ఎండలో నడవాలి. వీలైతే వైద్యుల సూచనల ప్రకారం కొన్ని వ్యాయామాలు చేస్తే మరీ మంచిది.
చలికాలంలో దాహం వెయ్యట్లేదని నీళ్లు తాగకుండా ఉండకూడదు శరీరం నీటి శాతం కోల్పోతే డిహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. కావున గుర్తొచ్చినప్పుడల్లా ఒక గ్లాస్ మంచినీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.ఇంట్లో వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళకండి. గర్భవతుల రోజువారి ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండునట్లు చూసుకోవాలి. ఆహార నియమాలతో పాటు మన శరీర శుభ్రతను అలాగే పరిసరాల శుభ్రతను కూడా పాటించాలి. ప్రతిరోజు స్నానం కచ్చితంగా చేయాలి, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
గర్భిణీ స్త్రీలు చలికాలంలో చలి తీవ్రతను తట్టుకోవడానికి మందపాటి దుస్తులను ధరిస్తుంటారు ఫలితంగా రక్త ప్రసరణలో లోపాలు తలెత్తి వాపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే పలుచటి వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు కాఫీ టీ వంటి పానీయాలను ఎక్కువగా సేవిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.