బెండకాయను ఆహారంగా తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఎర్ర బెండకాయలో సాధారణ బెండకాయ కంటే అదనపు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఎర్ర బెండకాయను కాశి బెండ, కుంకుమ బెండకాయ అని కూడా పిలుస్తారు. ఈ నూతన బెండ రకాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఎర్ర బెండకాయ ప్రత్యేకత ఏమిటంటే సాధారణ బెండకాయ కంటే జిగురు తక్కువగా ఉండి దాదాపు యాభై శాతం అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది.ముఖ్యంగా ఎర్ర బెండలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ , ఫైబర్ వంటి పోషక విలువలు లభించడంతోపాటు పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.
ఎర్ర బెండలో సాధారణ బెండ తో పోల్చినప్పుడు క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండి ఫైబర్ అత్యధికంగా లభ్యమవుతుంది కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎర్ర బెండను ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ నిలువలు సమర్ధవంతంగా నియంత్రించబడి డయాబెటిస్ వ్యాధి ముప్పును తగ్గించుకోవచ్చు. మరియు శరీర బరువును నియంత్రించుకోవాలనుకున్నవారు రోజువారి డైట్ లో ఎర్ర బెండను తీసుకుంటే సహజ పద్ధతిలో శరీర ఆకృతి సన్నగా దృఢంగా తయారవుతుంది.
ఎర్ర బెండలో అత్యధికంగా పొటాషియం,సాల్యుబుల్ ఫైబర్స్ లభిస్తుంది కావున చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది.
ఎర్ర బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం తొలగి శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎర్ర బెండలో సమృద్ధిగా లభించే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ కణాలను దృఢపరిచి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.