వేసవి సీజన్ మార్చి ఏప్రిల్ లో సమృద్ధిగా లభించే పచ్చి మామిడికాయను తినడానికి చాలామంది ఇష్టపడతారు.ముఖ్యంగా పచ్చి మామిడికాయతో రుచికరమైన పప్పు, చట్నీ, పచ్చళ్ళు, సలాడ్స్ తయారు చేసుకుని తినొచ్చు. నోరూరించే పుల్లని మామిడికాయ ముక్కలపై దోరగా కారం, ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరు. మార్చి ఏప్రిల్ నెలలో సమృద్ధిగా లభించే పచ్చి మామిడికాయ తింటే అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో చూద్దాం.
పచ్చి మామిడికాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ బి తోపాటు సమృద్ధిగా ఫైబర్ లభిస్తుంది. పచ్చి మామిడికాయను తింటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా కంటి ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. పచ్చి మామిడిలో సమృద్ధిగా ఉండే ఫైబర్, నియాసిన్ పొటాషియం, సోడియం వంటి పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి తద్వారా రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను నియంత్రించవచ్చు. పీచు పదార్థం సమృద్ధిగా లభించడం వల్ల జీర్ణశక్తి లోపాలు తొలగిపోయి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి మామిడికాయలను తక్కువగా తినడమే మంచిది.
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు పచ్చి మామిడికాయ ను తింటే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చిమామిడి లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి మామిడికాయ లో లభించే కాల్షియం, ఐరన్ ఫోలిక్ ఆమ్లం ,విటమిన్ కె రక్తహీనత, రక్తం గడ్డకట్టడం, హిమోఫిలియా వంటి ప్రమాదకర వ్యాధులను సైతం నియంత్రించడంలో సహాయపడుతుంది. పచ్చి మామిడి కాయను తింటే ఇందులో ఉండే విటమిన్ సి స్కర్వి వ్యాధిని నియంత్రించి చిగుళ్లలో రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలను తగ్గిస్తుంది.