Urination: ఎక్కువసార్లు మూత్రం వస్తోందా.. పురుషులు నిర్లక్ష్యం చేయకూడని సంకేతం ఇదే..!

పురుషుల్లో వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. అందుకే తరచూ మూత్రం రావడం లాంటి సమస్యలను చాలామంది సాధారణ వయస్సు ప్రభావంగా తీసిపారేస్తుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం ఈ లక్షణాన్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు తొలి సంకేతంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం.. ఇది మొదటి దశలో ఎలాంటి నొప్పి లేకుండా, స్పష్టమైన లక్షణాలు కనిపించకుండా నెమ్మదిగా పెరగడమే. శరీరం హెచ్చరికలు ఇస్తున్నా వాటిని పట్టించుకోకపోతే వ్యాధి లోపల లోపల పెరిగి, చికిత్స కష్టమయ్యే స్థితికి చేరుతుంది. అందుకే చిన్న అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి నిద్రలోనూ పదే పదే మూత్రం రావడం, మూత్రం ధార సన్నగా రావడం, మొదలుపెట్టడానికి ఎక్కువ సమయం పడటం, పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన ఉండటం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యలుగా భావిస్తారు. కానీ ఇవన్నీ ప్రోస్టేట్‌లో మార్పులు మొదలయ్యాయన్న సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.

మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడని సంకేతం. కొందరు దీనిని తాత్కాలిక ఇన్ఫెక్షన్‌గా భావించి వదిలేస్తారు. కానీ ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక కావచ్చు. అలాగే నడుము, పొత్తికడుపు భాగంలో నిరంతర నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట ఎక్కువగా అనిపించడం వంటి లక్షణాలు వ్యాధి ముందడుగు వేసిన దశలో కనిపిస్తాయి.

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఒక్క కారణం అని చెప్పలేము. వయస్సు పెరగడం ప్రధాన కారణంగా ఉండగా, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, హార్మోన్ల మార్పులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. పొగతాగడం, మద్యం సేవించడం, అధిక బరువు, వ్యాయామం లేని జీవనశైలి వంటి అలవాట్లు ఈ వ్యాధికి దారి తీసే అవకాశాన్ని మరింత పెంచుతాయి.

వైద్యుల సూచన ప్రకారం 50 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు ఇంకా ముందుగానే పరీక్షలు ప్రారంభించాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పూర్తిగా నియంత్రించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.