మన శరీరం ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒకటి సూచిస్తూనే ఉంటుంది. అయితే ఆ సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు చిన్న చిన్న సమస్యలుగా భావించి పట్టించుకోని లక్షణాలు నిజానికి పెద్ద వ్యాధుల హెచ్చరిక కావచ్చు. అలాంటి వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు ఈ వ్యాధి పేరు వినగానే భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైద్య రంగం అభివృద్ధితో చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మొదటి దశలో గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేయగలమని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కసారిగా బరువు తగ్గడం, ఎలాంటి ఆహార నియమాలు లేకుండా శరీర బరువు తగ్గిపోవడం క్యాన్సర్ ఒక ప్రధాన హెచ్చరిక. శరీరంలో మెటబాలిజం మార్పులకు గురై శక్తి తగ్గిపోతుంది. ఇది కేవలం క్యాన్సర్‌కే కాకుండా ఇతర సమస్యలకూ సంకేతం కావొచ్చు. కానీ నిరంతరంగా బరువు తగ్గుతూనే ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
అలాగే శరీరంలో గడ్డలు ఏర్పడటం మరో కీలక సంకేతం. ముఖ్యంగా బ్రెస్ట్, మెడ, పొట్ట, లివర్ వంటి ప్రాంతాల్లో వచ్చే లంప్స్ (lumps) చాలా ప్రమాదకరం. అవి నొప్పి లేకుండా పెరుగుతుంటే నిర్లక్ష్యం చేయడం అత్యంత ప్రమాదకరం. సాధారణంగా అన్ని గడ్డలూ క్యాన్సర్ కావని చెప్పినా, ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలి. కొంతమందికి ఆగని దగ్గు, ముఖ్యంగా రక్తం కలిసిన దగ్గు వస్తే అది లంగ్ క్యాన్సర్ సంకేతం కావచ్చు. ఇది సాధారణ దగ్గు, జలుబుతో భిన్నంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఎలాంటి శ్రమ లేకపోయినా ఊపిరి ఆడకపోవడం కూడా ఊపిరితిత్తుల సమస్యలకు, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
జీర్ణ సమస్యలు కూడా క్యాన్సర్‌కు సూచన కావచ్చు. పొట్ట నొప్పి, అజీర్తి, మలబద్ధకం లేదా బవెల్ మూమెంట్స్‌లో సమస్యలు ఉంటే అవి స్టమక్ లేదా ఇంటెస్టైన్ క్యాన్సర్‌కు దారితీస్తాయి. మలంలో రక్తం, యూరిన్‌లో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇవి కిడ్నీ లేదా బ్లాడర్ క్యాన్సర్ మొదటి దశ లక్షణాలు కావచ్చు.
నిపుణులు చెబుతున్నట్లుగా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం వంటివి పాటించడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ప్రస్తుతం క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ఎక్కువ రిస్క్‌లో ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు నిరంతరం చెకప్‌లు చేయించుకోవాలి. ఈ వ్యాధి తొలిదశలో గుర్తిస్తే, నేటి ఆధునిక చికిత్సలతో పూర్తి నయం అవ్వడం సాధ్యమేనని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
