స్నానం అనగానే చాలామందికి రిఫ్రెష్‌మెంట్ అనిపిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు మరోసారి షవర్ కింద స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే నిపుణుల చెబుతున్న విషయాలు వింటే మాత్రం ఆలోచించాల్సిందే. డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నదాని ప్రకారం రోజూ ఎక్కువ సార్లు స్నానం చేయడం చర్మానికి మంచిది కాదు. ముఖ్యంగా హాట్ వాటర్‌తో, హార్ష్ సోప్స్‌తో తరచుగా స్నానం చేస్తే స్కిన్ బారియర్ దెబ్బతిని, దీర్ఘకాలిక సమస్యలు రావచ్చని అంటున్నారు.
చర్మానికి సహజ రక్షణ కవచంలా పనిచేసే నేచురల్ ఆయిల్స్, గుడ్ బ్యాక్టీరియా అధిక స్నానాల వల్ల తగ్గిపోతాయని అంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మం పొడిబారడం, దురద, చికాకు వంటి సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. తాజాగా PMC జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం స్కిన్ మైక్రోబియోమ్ దెబ్బతింటే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని స్పష్టంచేశారు.
నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ప్రతీ ఒక్కరికీ రోజూ ఎక్కువ సార్లు తల స్నానం అవసరం లేదు. వారానికి రెండు నుంచి మూడు తల సార్లు స్నానం చాలామందికి సరిపోతుంది. అయితే ఎక్కువగా చెమట పట్టే వ్యక్తులు, అథ్లెట్లు, ధూళి, కాలుష్యం లేదా కెమికల్స్ మధ్య పనిచేసేవారు మాత్రం డైలీ స్నానం చేయాలి. మిగతావారు గోరువెచ్చని నీటితో, తక్కువ సమయం స్నానం చేసి, చెమట పట్టే ప్రాంతాలను (చంకలు, పాదాలు) శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అని సూచిస్తున్నారు.
స్నానం తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ వాడటం, మైల్డ్ ఫ్రాగ్నెన్స్-ఫ్రీ సోప్స్ ఉపయోగించడం చర్మాన్ని రక్షించడంలో కీలకమని వారు అంటున్నారు. “అధికంగా స్నానం చేయడం వల్ల తాత్కాలికంగా క్లీన్ ఫీలింగ్ కలిగినా, దీర్ఘకాలంలో ఇది చర్మ సమస్యలకు దారి తీస్తుంది. చర్మ రక్షణ కవచం బలహీనపడితే, UV కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ తగ్గుతుంది. ఫలితంగా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది” అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతీ ఒక్కరూ తమ లైఫ్‌స్టైల్, వాతావరణం, శారీరక శ్రమకు అనుగుణంగా స్నానపు అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. “క్లీన్లీనెస్‌కి కేర్ తీసుకోవడం తప్పు కాదు.. కానీ అదీ ఒక లిమిట్ వరకు మాత్రమే. దాన్ని అతిగా చేస్తే సమస్యలు తలెత్తుతాయి అని స్పష్టం చేస్తున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
