ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లలో సమూలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఇంట్లో చేసిన ఆహారానికి ఎక్కువ విలువనిచ్చి ఇష్టంగా తినేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. రోజుకొకసారి ఫాస్ట్ ఫుడ్ తినకపోతే ఆరోజు మొత్తం ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలామందికి. అంతలా జంక్ ఫుడ్ కు బానిసలుగా మారాము. తినటానికి రుచిగా ఉంది కదా అని రోజు ఫాస్ట్ ఫుడ్ తింటే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎప్పుడో ఒకసారి సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటే ఎలాంటి నష్టం లేదు కానీ అదే పనిగా ప్రతిరోజు పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ వంటివి తింటే మాత్రం ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ మోతాదుకు మించి పెరిగి భవిష్యత్తులో గుండె, మెదడు, లివర్ అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఫాస్ట్ ఫుడ్ తయారు చేయడానికి వినియోగించే నువ్వు నేను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల నూనెలో ఉండే విటమిన్స్ మినరల్స్ నశించి పోవడమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలుగా మారుతాయి. దానికి తోడు ఫాస్ట్ ఫుడ్ లో వినియోగించే అత్యధిక కొవ్వు పదార్థాలు, మసాలా దినుసులు, టేస్టీ సాల్ట్ వంటివి పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
చిన్నపిల్లలు చాలా తొందరగా జంక్ ఫుడ్ కు అలవాటు పడతారు. వాళ్లు మారం చేస్తున్నారు కదా అని మనం జంక్ ఫుడ్ తినిపించడం అలవాటు చేస్తే వీటిల్లో ఉండే ప్రమాదకర చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. పిల్లల్లో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా అనేక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచి మన శరీరానికి శక్తినిచ్చే పండ్లు , కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తో పిల్లలకి ఇష్టమైన సూప్స్, సలాడ్స్, జ్యూస్ రూపంలో ఇవ్వడం అలవాటు చేస్తే మంచిది.